ఎల్లారెడ్డి/భిక్కనూరు, ఏప్రిల్ 15: ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని బీసీ బాలికల హాస్టల్లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. నస్రూల్లాబాద్ మండలం హాజీపూర్‌కు చెందిన శ్రావణి (13) ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని బీసీ బాలికల హాస్టల్లో ఉంటూ, జడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నది. ఇదే హాస్టల్లో ఉంటున్న 9వ తరగతి విద్యార్థినులు మంగళవారం అర్ధరాత్రి వరకు చదువుకుని నిద్రపోయారు. బుధవారం తెల్లవారుజామున వాష్‌రూమ్ కోసమని గది నుంచి బయటకు వచ్చిన విద్యార్థినులకు వరండాలో శ్రావణి పడి ఉండటాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు.
వెంటనే వాచ్‌మన్‌కు విషయం చెప్పగా, ఆమె వార్డెన్ విజయశాంతికి, మరో ఇద్దరు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే వచ్చి ఉదయం 5 గంటల ప్రాంతంలో శ్రావణిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, పరీక్షించిన డాక్టర్ అప్పటికే ఆమె మరణించినట్టు ధ్రువీకరించారు. మృతురాలి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని చెప్పారు. విద్యార్థిని మృతి విషయాన్ని వార్డెన్ బాధిత కుటుంబ సభ్యులతోపాటు జిల్లా ఉన్నతాధికారి జయరాజ్‌కు ఫోన్లో సమాచారమిచ్చారు.
ఆర్డీవో ప్రభాకర్, సీఐ రాజిరెడ్డి, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ తదితరులు హాస్టల్‌కు వెళ్లి తోటి విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖాన ఎదుట గల ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.
బాలిక మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని, బాలిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాకు దిగిన జాజాలతోపాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి, భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శ్రావణి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపుతున్నామని, అంత్యక్రియల ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఇస్తున్నట్టు ఆర్డీవో ప్రభాకర్ తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భిక్కనూరు పోలీస్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజవకర్గాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఠాణా ఎదుట గల రహదారిపై బైఠాయించారు. జాజాలను వెంటనే విడుదల చేయాలని, బాలిక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని నినదించారు. పోలీసులు మాజీ ఎమ్మెల్యేను విడుదల చేయడంతో ఆందోళన విరమించారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి మరణించడం అత్యంత విషాదకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ బాధాకరమైన ఘటనకు విద్యాశాఖ మంత్రి కూడా అయిన సీఎం రేవంత్‌రెడ్డే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ, గురుకులాలు, హాస్టళ్లను అత్యంత పటిష్టంగా నిర్వహిస్తే, కాంగ్రెస్ సరార్ వాటిని అడుగడుగునా నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే 140 మందికిపైగా పిల్లలు సరార్ నిర్వాకం వల్ల కన్నామూసినా మానవత్వం లేని సీఎంలో చలనం లేదని మండిపడ్డారు. విద్యార్థిని శ్రావణి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులైన ప్రతి ఒకరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.