హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీలో పనిచేస్తున్న 891 మంది ఉద్యోగులను తెలంగాణకు అంటగట్టబోతున్నారు. ఈ మేరకు తమ రాష్ట్ర ఉద్యోగులను తీసుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వ సమ్మతి కోరుతూ ఏపీ జీఏడీ అధికారులు తెలంగాణ సీఎస్‌కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం వీరికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఈ 891 మంది ఉద్యోగులు తెలంగాణకు వస్తారు.
గత పన్నేండ్లలో 2,800 మంది ఉద్యోగులు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చారు. కొంతకాలం క్రితం రేవంత్‌రెడ్డి సర్కార్ 122 మంది గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులను ఏపీ నుంచి తెలంగాణకు రప్పించింది. తాజాగా మరో 891కి తెలంగాణకు పంపుతామంటూ ఏపీ లేఖ రాసింది. ఏపీ ఉద్యోగుల రాకను తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉద్యోగులను అనుమతించే విషయంలో సర్కార్ పునరాలోచించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ సిటీ బ్రాంచి అధ్యక్షుడు కస్తూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే వారికి రెడ్‌కార్పెట్ పరుస్తున్న సర్కార్.. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తామన్న వారి విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నది. 1,369 మంది టీచర్లు, ఉద్యోగులు తాము తెలంగాణలో ఉండలేమని, ఇక్కడ పనిచేయలేమని, తమను ఏపీకి పంపాలని మొత్తుకుంటున్నా పంపించడంలేదు. వీరంతా ఏపీ స్థానికత గల ఉద్యోగులే. వీరిలో టీచర్లు, జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులున్నారు.
వీరిలో 600 మంది టీచర్లున్నారు. 200 మంది వరకు 30% హెచ్ఆర్ఏలోనే పనిచేస్తున్నారు. 1,369 మందిని ఏపీకి పంపిస్తే జీతాలు, హెచ్ఆర్ఏ మిగులుతుందని.. అయినా సర్కార్ ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదని నాన్ లోకల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ వాపోయారు. ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగులను కేటాయించినట్టే.. తెలంగాణలోని వారిని ఏపీకి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు.