కాంగ్రెస్ రాజ్యంలో గురుకులాలు మృత్యుకుహ రాలుగా మారుతున్నాయి. ఆహారం విషతుల్యమై కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, ఆత్మహత్యలు చేసుకుని మరికొందరు విద్యార్థులు మరణిస్తున్నారు. పిల్లల మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగుల్చుతున్నాయి.
Gurukula Schools | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో విద్యాకుసుమాలు ఆదిలోనే వసివాడిపోతున్నాయి. ఆహార కలుషితంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. 27 రోజులుగా మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన విద్యార్థిని శైలజ మరణం గురుకులాల్లో మృత్యుఘోషకు నిలువెత్తు నిదర్శనం. కాంగ్రెస్ పాలనలో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 48 మంది విద్యార్థులు మృతి చెందడం విషాదకరం. ఇంత జరుగుతున్నా సర్కారులో చలనం లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి.
ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ఎక్కడ చూసినా నిర్లక్ష్యం తాండవిస్తున్నది. ఏడాదిగా హాస్టళ్లలో అనుమానస్పద మరణాలు, బలవన్మరణాలు, అనారోగ్యం, కలుషిత ఆహారం తిని చనిపోవడం వంటి ఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం విచారణ కమిటీలు ఏర్పాటు చేయడం, వార్డెన్‌ను, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయడంతో సరిపెడుతున్నది. సమస్యకు మూల కారణాలు కనుక్కొని శాశ్వత పరిష్కారం చూపడంపై దృష్టి సారించడం లేదు. కనీసం మంత్రులు సమీక్ష జరపడం లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చని విద్యార్థి, ఉపాధ్యాయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గురుకులాల్లో ఆహార కల్తీకి నాసిరకం సరుకులే కారణమని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యతలేని సరుకులను సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. కొత్తగా ప్రవేశపెట్టిన టైమ్ టేబుల్‌తో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గురుకుల విద్యార్థుల దినచర్య ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటున్నదని చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత 8.15 గంటల నుంచి మధ్యాహ్నం 1:25 వరకు వరుసగా 7 పీరియడ్లను నిర్వహిస్తున్నారు. సాయంత్రం గేమ్స్ తర్వాత పర్సనల్ టైమ్ 15 నిమిషాలే ఇస్తున్నారు. ఫలితంగా విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువ అవుతున్నందున ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఉపాధ్యాయులు వివరిస్తున్నారు.
పనిఒత్తిడి కారణంగానే తాము కూడా విద్యార్థుల పర్యవేక్షణపై ఎక్కువ దృష్టి సారించలేకపోతున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఉపాధ్యాయులకు డైనింగ్, వాటర్, శానిటరీ, కిచెన్ ఇన్స్పెక్షన్, ఏటీపీ రొటేషన్, స్టడీ అవర్స్ డ్యూటీ కూడా అప్పగించడం సరికాదని చెబుతున్నారు. తమ ఉద్యోగానికి, పనికి సంబంధమే లేదని అంటున్నారు. విద్యార్థులతోపాటు తాము కూడా మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 22న నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఎస్సీ గురుకులంలో 9వ తరగతి విద్యార్థిని భార్గవి ప్రార్థన సమయంలో కండ్లు తిరిగిపడిపోయింది. దవాఖానకు తరలించగా అప్పటికే భార్గవి మృతి చెందినట్టు డాక్టర్లు స్పష్టంచేశారు. ఇలాంటి వరుస ఘటనలతో విద్యార్థుల మొత్తం మరణాలు 48కి చేరాయి. ఇందులో 23 బలవన్మరణాలు, 8 అనుమాస్పద ఘటనలు కాగా ఫుడ్‌పాయిజన్‌తో నలుగురు మృతి చెందారు. అనారోగ్యంతో 13 మంది విద్యార్థులు చనిపోయారు. ఎస్సీ గురుకులాల్లోనే 13 మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 38 గురుకులాల్లో కలుషితాహార ఘటనల్లో 886 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా నలుగురు చనిపోయారు. ప్రభుత్వం ఇకనైనా గురుకులాలపై దృష్టి పెట్టాలని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.