హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు మేనేజ్మెంట్ కోటా సీట్లన్నీ ఆలిండియా క్యాటగిరీలో భర్తీ కాగా, ఇకపై 85% సీట్లు తెలంగాణ బిడ్డలకే ఇవ్వనున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తితో మేనేజ్మెంట్ కోటాలో 85% సీ ట్లు లోకల్ విద్యార్థులకు కేటాయించేందుకు సీఎం నిర్ణయం తీసుకుని.. ఉత్తర్వులు జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు. దీంతో రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ పీజీ, 70 డెం టల్ పీజీ సీట్లు దక్కనున్నాయి. ఈ నిర్ణయంపై జూనియర్ డాకర్ట్స్ అసోసియేషన్, హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తంచేశాయి.
ఫీజు బకాయిల కోసం 4న ‘చలో కలెక్టరేట్’ ; బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ
హైదరాబాద్, నవంబర్1 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న రాష్ట్రవ్యాప్తంగా ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు కార్యక్రమ విజయవంతం కోరుతూ రూపొందించిన పోస్టర్ను శనివారం ఆయన హైదరాబాద్లో ఆవిష్కరించారు. అనంతరం రామకృష్ణ మా ట్లాడుతూ బడుగుల విద్యపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని, తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీర్ఘకాలంగా ఆయా నిధులను విడుదల చేయడమే లేదని నిప్పులు చెరిగారు.