హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : కేఎల్ యూనివర్సిటీ (విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో) ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశానికి మొదటి విడత ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ పార్ధసారథి వర్మ విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆన్లైన్ ద్వారా ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత ప్రవేశ పరీక్షకు లక్ష మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇందులో 80 శాతం మంది విద్యార్థులు అర్హత పొందారని వెల్లడించారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకులు, ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా ఫీజులో మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. రెండో విడత ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డిగ్రీ, పీజీ, సైన్స్ కోర్సులకు జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ మొదటి విడతలో మెరుగైన ర్యాంకు పొందలేని వారు రెండో విడత ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చని సూచించారు. ఫలితాల కోసం https://www.kluniversity.in/, 9648229999 నెంబర్ల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.