హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చిన్నవయస్సులోనే చాలామంది గుండెపోటుబారిన పడుతున్నారు. ఇటీవల కొందరు సెలబ్రిటీలు సైతం జిమ్ చేస్తూ కార్డియాక్ అరెస్ట్‌తో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అయితే, సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్), ఏఈడీ (ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్) ద్వారా సడన్ కార్డియాక్ అరెస్ట్ బారినుంచి 80 శాతం మంది రోగుల ప్రాణాలను కాపాడొచ్చని చెబుతున్నారు ప్రముఖ గుండె వైద్యనిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ బీ విజయ్‌రావు. ప్రస్తుతం గాంధీ మెడికల్ కళాశాలలోని ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన సడన్ కార్డియాక్ అరెస్ట్ నుంచి రోగుల ప్రాణాలు ఎలా కాపాడొచ్చు అనేది ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. సీపీఆర్, ఏఈడీ పరిజ్ఞానాన్ని కేవలం డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యక్యత ఉందని చెప్పారు.
కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత మొదటి 5 నుంచి 6 నిమిషాలు అమృత ఘడియల్లాంటివని డాక్టర్ విజయ్‌రావు పేర్కొన్నారు. ఈ సమయంలో సీపీఆర్, ఏఈడీ రెండూ అందిస్తే రోగి ప్రాణాలను 80 శాతం వరకు కాపాడే అవకాశాలుంటాయని తెలిపారు. కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత కోలుకునే అవకాశాలు ప్రతి నిమిషానికి 7-8 శాతం తగ్గిపోతాయని, దవాఖానల బయట కేవలం 46 శాతం మందికి మాత్రమే సీపీఆర్ అందుతున్నదని వెల్లడించారు. భారతదేశంలో ప్రతీ లక్ష మంది జనాభాలో 4,280 మరణాలు సడన్ కార్డియాక్ అరెస్ట్ వల్లనే జరుగుతున్నట్టు వివరించారు. అన్ని రకాల కార్డియాక్ అరెస్ట్ మరణాల్లో 30 శాతం హాస్పిటల్స్‌లో జరుగుతుండగా, 70 శాతం మరణాలు దవాఖానల బయట జరుగుతున్నట్టు వివరించారు. ఈ మరణాలన్నీ దాదాపు ఇండ్లలోనే సంభవిస్తున్నట్టు వివరించారు. ఇండ్లల్లో కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యేవారికి సకాలంలో సీపీఆర్, ఏఈడీ అందిస్తే ప్రాణాలు కాపాడొచ్చని తెలిపారు. మన దేశంలో 70 శాతం జనాభా గ్రామీణ ప్రాంతానికి చెందినవారే కావడం, నిరక్షరాస్యత అధికంగా ఉండడం, అత్యవసర సేవలు ప్రాథమిక దశలోనే ఉండడంతో కార్డియాక్ అరెస్ట్‌కు గురైన రోగికి సకాలంలో సీపీఆర్, ఏఈడీ అందడం లేదన్నారు. వీటిని అధిగమించాలంటే సీపీఆర్‌పై విస్తృతంగా అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.