సజీవ ఆశలు ఆవిరయ్యాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ప్రాణాలు మట్టిదిబ్బల కింద కలిసిపోయాయి. దాదాపు 11 రెస్క్యూ బృందాలు చేసిన ప్రయత్నాలు చివరికి విఫలమయ్యాయి. టన్నెల్లో కూరుకుపోయినవారి మృతదేహాలను శుక్రవారం అర్ధరాత్రిదాకా శ్రమించి బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది.. పోస్టుమార్టం కోసం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం నేడు అధికారికంగా ప్రకటించే అవకాశమున్నది. ముందుగా చిక్కుకుపోయిన కార్మికులను గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్‌తో గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే జీపీఆర్ ద్వారా జీరో పాయింట్ వరకు చేరుకొని ఆ ప్రదేశమంతా స్కాన్ చేశారు. రిపోర్టు ఆధారంగా స్పాట్లను గుర్తించి కొత్తగూడెం నుంచి అండర్ గ్రౌండ్లో పనిచేసే సింగరేణికి చెందిన అనుభవజ్ఞులైన కార్మికులను రప్పించారు. ఎన్డీఆర్ఐ, ర్యాట్ మైనర్స్ టీం, సింగరేణి బృందంతో హై లెవెల్ రెస్క్యూ ఆపరేషన్ చేసి టీబీఎం ముందు భాగంలో చిక్కుకున్నారని గుర్తించి మట్టిదిబ్బలు, బురదను తొలగించి మృతదేహాలను బయటకు తీసినట్టు తెలిసింది. శుక్రవారం రాత్రంతా ఇక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొనగా చివరికి విషాదమే మిగిలింది.
SLBC Tunnel Collapse | మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడను కనిపెట్టే రెస్క్యూ ఆపరేషన్ ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. శుక్రవారం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ‘గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్’ (జీపీఆర్) పరికరంతో కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించినట్టు తెలుస్తున్నది. రెస్క్యూ బృందాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి జీపీఆర్ ద్వారా జీరో పాయింట్ వరకు చేరుకొని ఆ ప్రదేశమంతా స్కానింగ్ చేశారు. ఈ రిపోర్టును పరీక్షించిన అనంతరం కార్మికులు ఐదు స్పాట్లలో చిక్కుకొని ఉంటారనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. మరోసారి క్రాస్‌చెక్ చేసుకున్న బృందం ఇది నిజమేనన్న నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. మరోవైపు, గత 36 గంటలుగా విరామం లేకుండా రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటికే అక్కడ ఉన్న 11 బృందాలతోపాటు తాజాగా కొత్తగూడెం నుంచి అండర్‌గ్రౌండ్‌లో పనిచేస్తున్న సింగరేణికి చెందిన అనుభవజ్ఞులైన కార్మికులను రప్పించారు. ఎన్డీఆర్ఐ గుర్తించిన స్పాట్ల వద్ద శుక్రవారం ఎన్డీఆర్ఐ, ర్యాట్మైనర్స్ టీం, సింగరేణి బృందంతో హైలెవెల్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగుసార్లు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం శనివారం వరకు కార్మికుల ఆచూకీని కనుక్కోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో సొరంగం వద్ద హడావుడి మొదలైంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు మీడియా ప్రతినిధుల రాకపై పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించారు.
జీపీఆర్తో పలుమార్లు స్కానింగ్
భూమిలో కూరుకుపోయిన వారి ఆచూకీని కనిపెట్టే జీపీఆర్ మిషన్‌తో ఉదయం లోపలికి వెళ్లిన ప్రత్యేక బృందం అతికష్టం మీద సాయంత్రానికి లోపలికి చేరుకొని అనేకసార్లు స్కాన్ చేసింది. ఆ ప్రదేశం ప్రమాదభరితంగా ఉన్నప్పటికీ, ప్రాణాలకు లెక్కచేయకుండా కచ్చితమైన ఫలితాలను రాబట్టినట్టు తెలుస్తున్నది. ఈ బృందం కార్మికులు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్న ఐదు స్పాట్లను గుర్తించి బయటకొచ్చింది. లోపల స్కాన్ చేసి తెచ్చిన రిపోర్టును పరిశీలించి ఆ ఐదు స్పాట్లలోనే కార్మికులు ఉండి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నివేదిక రాగానే విపత్తు నిర్వహణ చీఫ్ కమిషనర్ అర్వింద్‌కుమార్ నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందంతో సమీక్ష నిర్వహించారు. గుర్తించిన స్పాట్లపై మార్కింగ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. తిరిగి లోపలికి వెళ్లిన బృందం ఆ స్పాట్లను పరిశీలిస్తున్న ది. మార్కింగ్ తర్వాత బురదను తవ్వుతూ త ప్పిపోయిన వారి ఆచూకీ కోసం ఆర్మీ, నేవీ, సింగరేణి టీంను అక్కడికి యుద్ధ ప్రాతిపదికన పంపించారు. శనివారం మధ్యాహ్నం వరకు కార్మికుల ఆచూకీ దొరుకుతుందని భావిస్తున్నట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
మిషన్‌ను తొలగించాలంటే మరో వారం
టన్నెల్లో అడ్డంగా పడి ఉన్న టీబీఎం మిషన్‌తోపాటు పేరుకుపోయిన మొత్తం బురదను తొలగించాలంటే వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం టీబీఎం మిషన్‌ను కటింగ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. మరోవైపు, సొరంగంలో 12 కిలోమీటర్ల వరకు మాత్రమే లోకోట్రైన్ వెళ్తుంది. అక్కడినుంచి విద్యుత్తు సౌక ర్యం పునరుద్ధరించే సామగ్రిని, మిషనరీని ప ట్టుకొని రెస్క్యూ బృందాలు రెండు కిలోమీట ర్లు నడవాల్సి ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ చా లా తక్కువగా ఉండటంతోపాటు చేతుల్లో భా రీ మిషనరీలతో అక్కడికి వెళ్లడం సాధ్యం కాకపోవడంతో దశలవారీగా వాటిని లోపలికి పం పించారు. దీంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. విపక్షాలనుంచి, చిక్కుకున్న కార్మికుల బంధువుల నుంచి విమర్శలు ఎక్కు వ కావడంతో కార్మికుల జాడను తెలుసుకునేందుకు జీపీఆర్ టెక్నాలజీ వైపు మొగ్గు చూపారు.
సొరంగం వద్ద ఉద్విగ్న క్షణాలు
సొరంగంలో ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ వద్ద రిఫ్లెక్టెడ్ తరంగాలను పంపించడం ద్వారా మట్టిలో కూరుకుపోయిన కార్మికుల ఆనవాళ్లను గుర్తించడంతో సహాయక చర్యలు చేపట్టిన బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి. దీంతో ఆ స్పాట్లలోనే తవ్వి తీయాలని ఉన్నతాధికారులు హుటాహుటిన నిర్ణయం తీసుకున్నారు. టీబీఎం ముందుభాగంలో అయిదుగురి ఆనవాళ్లు లభించినట్టు తెలుస్తున్నది. దా నికి సమీపంలోనే మరో ముగ్గురు ఉండి ఉం టారని అనుమానిస్తున్నారు. కాగా, రెండురోజులుగా రెస్క్యూ బృందాలు నిర్విరామంగా ప నిచేస్తున్నాయి. సొరంగం లోపల ఆశించిన స్థాయిలో ఫలితం వచ్చే అవకాశం లేదని భావించి ప్రమాదం జరిగిన స్పాట్‌పై ఫోకస్ పెట్టారు. ఎట్టకేలకు ఏడు రోజుల తర్వాత ఫలితం కనిపించడంతో సొరంగం వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది.
ఆ స్పాట్లు గుర్తించలేదు : కలెక్టర్ సంతోష్
ఐదు స్పాట్లు గుర్తించినట్టు మీడియాలో వస్తున్న సమాచారం పూర్తిగా అబద్ధమని, అ యితే, ఎన్జీఆర్ఐ ద్వారా జీపీఆర్ స్కానింగ్ చే సిన మాట వాస్తవమేనని నాగర్‌కర్నూల్ కలెక్ట ర్ బదావత్ సంతోష్ మీడియాతో చెప్పారు. ప్రమాదం జరిగిన చోట ఈ మిషన్ ద్వారా స్కానింగ్ చేసిన రిపోర్టులు పరిశీలిస్తున్నామని తెలిపారు. అధికారికంగా ప్రకటించక ముందే కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లలో మాదిరిగా లేనిపోనివి ప్రచారం చేయవద్దని కోరారు. అయితే, ఎన్డీఆర్ఐ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం ఐదు స్పాట్లు గుర్తించిన విషయం వాస్తవమేనని సింగరేణి సీఎండీ బలరాం, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ మీడియా ప్రతినిధుల ముందు వెల్లడించారు. దీంతో ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. మరోవైపు, మీడియాలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో షాక్ తిన్న సర్కార్ అ దంతా అబద్ధమని కలెక్టర్‌తో చెప్పించినట్టు ప్ర చారం జరుగుతున్నది. సహాయక చర్యలను ప ర్యవేక్షిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనకు తెలియకుండా మీడియాకు ఎలా లీక్ చేశారం టూ ఆగ్రహం వ్యక్తంచేశారని చర్చించుకుంటున్నారు. రోజూ ఉదయమే హెలికాప్టర్లో వస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం మాత్రం రాలేదు.
నేడు కొలిక్కి వచ్చే అవకాశం
జీపీఆర్ఎస్ ద్వారా కార్మికుల జాడను గుర్తించడంతో ఇక రెస్క్యూ ఆపరేషన్ సులభంగా మారింది. అక్కడ మట్టి, పేరుకుపోయిన బురదను ఏ విధంగా తొలగించాలనే దానిపై ఉన్నతాధికారులు రెస్క్యూ బృందాలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో వెంటవెంటనే ఆ బృందాలను లోపలికి పంపించారు. స్పాట్లను మార్కింగ్ చేయడంతోపాటు తవ్వడం కూడా ప్రారంభించినట్టు తెలుస్తున్నది. శనివారం తెల్లవారుజాము లేదా మధ్యాహ్నం వరకు చిక్కుకున్న వారందరినీ బయటకు తీస్తామన్న ధీమాతో ఉన్నారు.
విశ్వ ప్రయత్నం… విషాదాంతం!
ఎనిమిది మృతదేహాలు వెలికితీత?మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం విషాదాంతంగా ముగిసింది. సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి వెలికితీసినట్టు తెలుస్తున్నది. అయితే, అధికారికంగా దీనిని ధ్రువీకరించడం లేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించేందుకు ఏర్పాట్లుచేసినట్టు సమాచారం. నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖాన డాక్టర్లను అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తున్నది. డ్యూటీ డాక్టర్లను కూడా రాత్రికి రాత్రి రప్పించారు. సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు.
శిథిలాల తరలింపు ఆశామాషీ కాదు
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమా దం సంభవించి ఏడు రోజులు గడిచాయి. ఆర్మీ, నేవీ, ర్యాట్ మైనర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ బృం దాలు కూడా సహాయక చర్యలను చేపట్టాయి. అయితే, సొరంగంలోని మట్టి, రాళ్లు, బురద, శిథిలాలను తొలగించడం అంత అషామాషీ కాదని తెలుస్తున్నది. సొరంగం తవ్వకం సమయంలో చేసిన గ్రౌటింగ్ కూడా ప్రస్తుతం సమస్యగా మా రిందని ఇంజినీరింగ్ వర్గాలు వెల్లడిస్తున్నా యి. ఎస్ఎల్బీసీ ఇన్లెట్ టన్నెల్లో ప్ర స్తుతం పనులు కొనసాగుతున్న 14వ కిలోమీటర్ వద్ద దాదాపు ఎనిమిది మీటర్ల పొ డవుతో షియర్‌జోన్ ఉన్నట్టు గుర్తించారు. భూమి పొరల్లో భౌతిక ఒత్తిళ్లకు గురై, రాళ్ల భాగాలు ఒకదానికొకటి వ్యత్యాసంగా తేలికగా సర్దుబాటవడం, రాతి ఆకృతులు మా రిపోవడం, చీలికలు ఏర్పడి పూర్తిగా పటుత్వాన్ని కోల్పోయి ఉన్నాయని గుర్తించా రు. ఆ పగుళ్లను పూడ్చివేసి, నీటి ఊటను నిరోధించేందుకు గ్రౌటింగ్ చేస్తారు. అంటే సిమెంట్‌తోపాటు సోడియం సిలికేట్, పాలీయురెతేన్, ఎపోగ్జిస్ తదితర రసాయనాల సమ్మేళనాన్ని భూమి, రాతిపొరల పగుళ్లలోకి ప్రెషర్‌తో పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో దాదాపు ఎనిమిది మీటర్ల పొడువునా ఆ జోన్ ఉండగా, ఆ మేరకు అధికారులు దాదాపు మూడు లక్షల క్యూబిక్‌మీటర్ల మేర సిమెంట్ గ్రౌటింగ్ చేశారు. అది పనిచేయకపోవడంతో కెమికల్ గ్రౌటింగ్ కూడా నిర్వహించారు. అయినప్పటికీ నీటి ఊటను నిర్దేశిత మోతాదులో నిరోధించలేకపోయారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే సొరంగం కూలిపోయింది. ఇక టన్నెల్లో కన్వేయర్ బెల్ట్, లొకోపైలట్ ట్రాక్ మర మ్మతుల తర్వాతే శిథిలాల తరలింపు ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది.