ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల కిందట కాంగ్రెస్ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్లో శనివారం భారీ ప్రమాదం జరిగింది. 42 ఏండ్ల కిందట అంకురార్పణ చేసిన ఈ ప్రాజెక్టు పనులు 2006లో మొదలై అడపాదడపా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులను పునఃప్రారంభించిన నాలుగు రోజులకే నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో సొరంగం కుప్పకూలింది. శనివారం ఉదయం మొదటి షిఫ్ట్‌లో సుమారు 50 మంది కార్మికులు టన్నెల్ లోనికి వెళ్లగా 8:30 గంటల ప్రాంతంలో 14వ కిలో మీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.
ఈ ఘోర ప్రమాదం నుంచి 42 మంది ప్రాణాలతో బయటపడగా, 8 మంది ఉద్యోగులు, కార్మికులు మట్టిదిబ్బల కింద చిక్కుకుపోయారు.
వారిని కాపాడేందుకు కంపెనీ ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సిబ్బంది చిక్కుకున్న ప్రాంతంలో మట్టి దిబ్బలు, కాంక్రీట్ పెచ్చులు, భారీగా నీళ్లు చేరడంతో అక్కడికి వెళ్లడం రెస్క్యూ సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. వారిని సురక్షితంగా ఉంచేందుకు బయటి నుంచి ఆక్సిజన్ సరఫరా కొనసాగిస్తున్నట్టు అధికారయంత్రాంగం వెల్లడించింది.
టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బంది వీరే.. మనోజ్‌కుమార్, శ్రీనివాస్, సందీప్ సాహు, జట్కాస్, సంతోష్ సాహు, అను సాహు, సన్నీ సింగ్, గుర్ప్రీత్ సింగ్
SLBC Tunnel | అచ్చంపేట, ఫిబ్రవరి 22: నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు ఏర్పాటుచేస్తున్న శ్రీశైలం ఎడమగట్టు ఎస్సెల్బీసీ టన్నెల్లో భారీ ప్రమాదం జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఎస్సెల్బీసీ టన్నెల్ పనుల్లో 14 కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదం నుంచి 42 మంది కార్మికులు, ఇంజినీర్లు తప్పించుకోగా, ఎనిమిది మంది లోపల చిక్కుకున్నారు. వారిని బయటకు రప్పించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇటీవల సుదీర్ఘ విరామం తర్వాత పనులను పునః ప్రారంభించింది. శనివారం ఉదయం మొదటి షిఫ్ట్‌లో సుమారు 50 మంది కార్మికులు సొరంగంలో పనులు చేసేందుకు లోపలికి వెళ్లారు. 8:30 గంటల ప్రాంతంలో కార్మికులు పనులు చేస్తుండగా, అకస్మాత్తుగా పైకప్పు కూలిపడింది. మట్టిపెల్లలు విరిగిపడ్డాయి. దాదాపు మూడు కిలోమీటర్ల మేర పైనుంచి కాంక్రీట్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో భూకంపం వచ్చినట్టుగా భారీ శబ్దం వచ్చింది.
ఈ తీవ్రతతో దాదాపు వెయ్యి క్యూబిక్ మీటర్ల రాళ్లు, మట్టి సంఘటనా స్థలంలో పేరుకుపోయాయి. దీంతోపాటు భారీగా కూలిపడిన పెచ్చులు, మట్టిపెల్లలు, కాంక్రీట్తోపాటు టన్నెల్లో నీరు చేరిపోవడంతో టన్నెల్ బ్లాక్ అయిందని అధికారులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సొరంగంలో పనుల్లో ఉన్న కార్మికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాదాపు 42 మంది కార్మికులు, ఇంజినీర్లు మిషనరీని వదిలేసి ప్రాణాలు అరచేత బట్టుకుని బయటకు పరుగులు తీశారు. వీరిలో కొందరు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం జెన్కో దవాఖానకు తరలించారు.
వీరంతా సురక్షితంగా ఉన్నారు. మరో ఎనిమిది మంది జేపీ కంపెనీ ఉద్యోగులు, కార్మికులు టన్నెల్‌లోనే ఉండిపోయారు. వారిని బయటకు రప్పించేందుకు కంపెనీ ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారు చిక్కుకున్న ప్రాంతంలో మట్టిపెల్లలు, కాంక్రీట్ పెల్ల్లలు, నీళ్లు చేరడంతో అక్కడికి వెళ్లడానికి ఇబ్బందికరంగా మారింది. చిక్కుకున్న వారు సురక్షితంగా ఉండేందుకు బయటి నుంచి ఆక్సిజన్ సరఫరాను కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోగా తర్వాత సరఫరాను పునరుద్ధరించారు.
ప్రమాదం ఊహాచిత్రం
సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను జేపీ కంపెనీ అధికారులు, ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. కొద్దిదూరం టన్నెల్లోకి వెళ్లి పరిశీలించారు. కొద్దిసేపటి తర్వాత మరో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అక్కడికి చేరుకున్నారు. అంతకుముందు కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మంత్రులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు.
జరిగిన సంఘటనపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ అధికారులకు సూచించారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. జియలాజికల్ సర్వే చేసి, చెక్ చేసిన తర్వాతే పనులు పున:ప్రారంభించినట్టు తెలిపారు. శనివారం సాయంత్రానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం రాగా.. భారత సైన్యం కూడా వస్తుందని వెల్లడించారు. ఇక్కడ పనులు చేస్తున్న జేపీ కంపెనీ, రాబిడ్స్ కంపెనీకి సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం మద్దతుగా నిలబడి పూర్తి సహకారం అందిస్తున్నామని అన్నారు. లోపల చిక్కున్న ఎనిమిది మంది ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం సర్వశక్తులా ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఈ మధ్య ఉత్తరాఖండ్‌లో ఇలాంటి సంఘటన జరిగిందని, అక్కడి వారితో మాట్లాడి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఎస్సెల్బీసీ టన్నెల్లో దాదాపు రెండు కిలోమీటర్ల మేర నీళ్లు నిండుకున్నట్లు అక్కడి అధికార వర్గాలు, కార్మికులు వెల్లడించారు. ఇన్‌లెట్‌లో టన్నెల్లో 14 కిలోమీటర్ల వద్ద ప్రమాదం సంభవించింది. సొరంగ మార్గం పూర్తిగా పూడుకుపోయింది. అయితే ఊట నీరు ఎక్కువ మొత్తంలో వస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో ముందకు వెళ్లలేని పరిస్థితి ఉన్నట్టు తెలుస్తున్నది. దాదాపు అర్ధరాత్రి వరకు మీటరుకుపైగా నీటి మట్టం ఉన్నట్టు అంచనా.రాత్రి 10.30 గంటల వరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తోపాటు సింగరేణి రెస్క్యూ టీం బృందాలు లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది.
టన్నెల్ ప్రమాదంలో లోపల చిక్కుకున్న 8 మంది ఉద్యోగులు, కార్మికుల వివరాలను జేపీ కంపెనీ అధికారులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్ద రు మిషన్ ఆపరేటర్లు, కార్మికులు ఉన్నా రు. మనోజ్‌కుమార్, శ్రీనివాస్, సందీప్‌సాహు, జట్కాస్, సంతోష్‌సాహు, అనుసాహు, సన్నీసింగ్, గుర్‌ప్రీత్‌సింగ్ ఉన్నా రు. వీరు పంజాబ్, జమ్ముకశ్మీర్, యూపీ, జార్ఖండ్‌కు చెందినవారిగా అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం సాయంత్రానికి దోమలపెంటకు చేరుకున్నది. వారితో జిల్లా కలెక్టర్, ఎస్పీ చర్చించారు. ఆర్మీ సహాయక బృం దం కూడా రానున్నది. చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
టన్నెల్లోకి అందరం పనులకు వెళ్లినం. నీళ్లు వస్తున్నయి. నేను క్యాబిన్లో ఫోన్ పెట్టిపోదామని వచ్చిన. పెద్ద శబ్దం వచ్చింది. అందరూ బాగోబాగో అని అరు స్తున్నరు. నాముందు ఇంకో అతను కిందపడ్డడు. పైకి లేవడానికి రావట్లేదు. నేను అతని దగ్గరికి వెళ్లి, నావద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగించి చేతులు పట్టి పైకి లాగిన. పైపు ద్వారా బయటకు పంపించిన. అందరం భయంతో పరుగులు తీసినం. మా వెనుక నీళ్లు భారీగా వచ్చేస్తున్నయి. మూడు కిలోమీటర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసినం. చివరికి బతికి బయటపడ్డం. నిమిషం లేటైనా మేమంతా సచ్చిపోయేటోళ్లం.
-అల్లావుద్దీన్, ప్రత్యక్ష సాక్షి