హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2008 జాబితాలో అర్హులైన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎనిమిది మంది పేర్లు గల్లంతయ్యాయి. 2010 జూన్‌లో విద్యాశాఖ విడుదల చేసిన కామన్ మెరిట్ లిస్ట్‌లో పేరు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ శనివారంతో ముగియనుండటంతో తమకు చోటు కల్పించాలని అభ్యర్థులు వేడుకున్నారు. 2008-డీఎస్సీ బాధితులకు కాంట్రా క్టు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు విద్యాశాఖ వెబ్సైట్లో జిల్లాలవారీగా జాబితాను పొందుపరిచింది. అయితే కొన్ని జిల్లాల్లో బాధితుల పేర్లు కనిపించకపోవడంతో 2010 జూన్‌లో విద్యాశాఖ విడుదల చేసిన కామన్ మెరిట్ లిస్ట్ ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ కరీంనగర్లో మాత్రం అధికారులు కామన్ మెరిట్ లిస్టు పట్టించుకోవడంలేదని అభ్యర్థులంటున్నారు. అడిగితే ఇదే ఫైనల్ జాబితా అని సమాధానం ఇస్తున్నట్టు చెపున్నారు. 14 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగి అలిసిపోయామని, ప్రభుత్వం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులు అడ్డుకోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.