హైదరాబాద్, నవంబర్ 24 (హైదరాబాద్); సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రత్యేకంగా చార్టెడ్ విమానంలో (Charted Flight) ఢిల్లీ వెళ్లారు. ఎనిమిది నిమిషాల కార్యక్రమానికి వెళ్లిరావడం కోసం రూ.80 లక్షలు ఖర్చు పెట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన హర్యానాకు చెందిన వారు. ఈ కార్యక్రమానికి హర్యానా సీఎం, తెలంగాణ సీఎం ఇద్దరే సీఎంలు హాజరయ్యారు. లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కూడా పాల్గొనలేదు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతున్నది.
దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేని ఆసక్తి.. రేవంత్‌రెడ్డికి మాత్రమే ఉన్నదని, అనవసరంగా రూ.80 లక్షలు ఖర్చు చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తమ ముఖ్యమంత్రి అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారని, ఢిల్లీకి వెళ్లేటప్పుడు ఎకానమీ క్లాసులో వెళ్తారని చెప్పుకొస్తుంటారు. మరి ఇలా ప్రత్యేక విమానాలు వేసుకొని వెళ్లడం కాంగ్రెస్ వాళ్లకు కనిపించడంలేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌కు హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలో కూడా సీఎంలు ఉన్నారని, వాళ్లు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. ఇక.. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక తన 58వ పర్యటన ముగించుకొని సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు.