హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార కమిషనర్, మార్కెటింగ్ డైరెక్టర్‌గా కే సురేంద్రమోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే ఆరోగ్యశ్రీ సీఈవో ఎల్ శివకుమార్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆరోగ్యశ్రీ సీఈవోగా ఆర్వీ కర్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీగా ఉన్న కే హరితను కమర్షియల్ ట్యాక్స్ డైరెక్టర్‌గా నియమించింది.
ఇప్పటి వరకు ఆ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీకి ఉపశమనం కల్పించింది. అలాగే హార్టికల్చర్, సెరికల్చర్ డైరెక్టర్‌గా ఉన్న ఎస్ఏ యాస్మిన్‌బాషాను తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. ఇప్పటి వరకు ఆ అదనపు బాధ్యతలు చూస్తున్న పీ ఉదయ్‌కుమార్‌కు ఉపశమనం కల్పించింది. హెచ్ఏసీఏ ఎండీగా ఉన్న కే చంద్రశేఖర్‌రెడ్డిని తెలంగాణ ఫుడ్స్ ఎండీగా నియమించింది. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న బీ శ్రీనివాసరెడ్డిని మాతృసంస్థకు బదిలీ చేసింది. అలాగే వనపర్తి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌ను నారాయణపేట అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్)గా బదిలీ చేసింది.