హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : కుటుంబ కలహాలకు చెక్‌పెట్టి బా ధితులకు అండగా నిలువడంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలు విజయవంతం అ య్యాయి. ట్రై కమిషనరేట్ల పరిధిలో మొత్తం 27 సెంటర్లకుగానూ ఇప్పటికే 9 కేంద్రాల్లో విజయవంతంగా కౌన్సెలింగ్ కొనసాగుతున్నది. ‘మై సేఫ్ సిటీ ప్రాజెక్ట్’లో భాగంగా ఉమెన్ సేఫ్టీవింగ్లోని భరోసా సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న 8 ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయెల్ తెలిపారు.
‘నిర్భయ నిధుల’ నుంచి మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 27 సెంటర్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ) ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వీటిల్లో 9 సెంటర్లు ఇప్పటికే మహిళలకు సేవలందిస్తున్నాయని తెలిపారు. మరో 8 కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన సెంటర్లు కూడా అతి కొద్దికాలంలోనే అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. కొత్తగా ఎనిమిది మంది కౌన్సెలర్లు, ఎనిమిది మంది రిసెప్షనిస్టులను ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు.