హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తేతెలంగాణ): జేఎన్టీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్, వృత్తివిద్యా కళాశాలల విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలకు హాజరుకావాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి. అనారోగ్య కారణాల రీత్యా డాక్టర్ ధ్రువీకరణ ఉం టే 10 శాతం మినహాయింపు ఇస్తారు. నిర్దిష్ట హాజరుశాతం లేదంటే డిటెన్షన్ అయినట్టే. కరోనా ప్రభావం వల్ల రెండు విద్యాసంవత్సరాలు హాజరుశాతం నుంచి మినహాయించి, డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయగా జేఎన్టీయూ తాజాగా పునరుద్ధరించింది. ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోవడం, సాధారణ పరిస్థితులు నెలకొనడంతో బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ సహా వర్సిటీలో చదువుతున్న విద్యార్థులంతా 75శాతం హాజరు పాటించాలని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.
మినహాయింపులన్నీ రద్దు
కరోనాతో రెండేండ్లపాటు వర్తింపజేసిన మినహాయింపులన్నింటినీ జేఎన్టీయూ రద్దు చేసింది. గతంలో సెమిస్టర్ పరీక్షల్లో ఒక్కో యూనిట్లో 8 ప్రశ్నలిచ్చి ఐదింటికి సమాధానాలు రాసే అవకాశం ఉండగా, దాన్ని ఉపసంహరించారు. విద్యార్థుల ఆప్షన్ ప్రకారం ఇంజినీరింగ్ కాలేజీల్లో పరీక్ష కేంద్రాలను ఏ ర్పాటు చేయగా, తాజాగా ఈ విధానాన్ని ర ద్దు చేసి, ఎక్కడైనా పరీక్షకేంద్రాన్ని కేటాయిం చే పాత విధానాన్ని అమల్లోకి తెచ్చారు.