హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : నీరామృతాన్ని సేవించిన అందగత్తెలు మైమరచిపోయారు. లొట్టలేసుకుంటూ సహజసిద్ధమైన కల్లు తాగారు. వావ్.. ఇట్స్ ఐస్ ఫ్రూట్.. ఐస్ ఫ్రూట్.. ఇట్స్ అమేజింగ్.. అంటూ తాటి ముంజలను తనివితీరా తిన్నారు. నీరా టిన్స్‌ను.. కోక్ టిన్స్లా ఓపెన్ చేసి తా గుతూ వావ్.. వాట్ ఏ టేస్ట్ అంటూ అమృతానందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించారు. ఆదివారం మిస్‌వరల్డ్ పో టీల్లో వివిధ దేశాల సుందరీమణులకు చిలుకూరు దగ్గర ఎక్స్పీరియం ఎకోపార్క్‌లో టొమాటోర (టమాటా ఉత్సవం) నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రిజం సంస్థ కల్లుగీత కార్పొరేషన్, నీరాకేఫ్ నిర్వాహకుల ఆధ్వర్యంలో నీరా, కల్లు, ముంజలు, హ్యాండ్ క్రాఫ్ట్స్‌ను పరిచయం చేశారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్నవాళ్లు ఈవెంట్లలో బయటి పదార్థాలు తినరు, తాగరు. కానీ తేనీరా కేఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాటి ఉత్పత్తులు, తాటాకు దండలు, నీరా, కల్లు, ముంజలు చూసి రూల్స్బ్రేక్ చేశారు. అందమైన తాటాకు దండలను మెడలో ధరించి, నీరా సేవించారు. అందాలభామలతో పాటు కార్యక్రమానికి వచ్చిన ప్రతినిధులు లొట్టలేసుకుంటూ కల్లు తాగుతూ, ముంజల రుచిని ఆస్వాదించారు.