సిరిసిల్ల నూతన కలెక్టరేట్ వెనుక ట్రాన్స్‌లొకేషన్
మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ ప్రత్యేక చొరవ
హైదరాబాద్, ఫిబ్రవరి 14 సిరిసిల్ల కలెక్టరేట్: మోడుగా మారిన మర్రిచెట్టు మళ్లీ జన్మించింది. నేలకొరిగిన 70 ఏండ్ల భారీ వృక్షం మళ్లీ నిలబడింది. ఓ యువకుడి సంకల్పం, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల నూతన కలెక్టరేట్ వెనుక భాగంలో ట్రాన్స్‌లొకేట్ అయ్యింది. జిల్లాలోని కోనరావుపేట మండలం సుద్దాల గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో ఉన్న మర్రిచెట్టు ఆ మధ్య కురిసిన భారీ వర్షాలకు కూకటి వేళ్లతో పడిపోయింది. నీరు అందక కొద్ది రోజులకు మోడుగా మారింది. అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు డాక్టర్ దొబ్బల ప్రకాశ్.. దానికి నీరు పోసి చిగురించేలా చేశారు. విషయం తెలుసుకొన్న ఎంపీ సంతోష్.. ఆ చెట్టుకు పునర్జన్మనిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ చెట్టును ట్రాన్స్‌లొకేట్ చేసి జిల్లా కలెక్టరేట్ వద్ద నాటాలని నిర్ణయించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సుద్దాలలో మర్రిచెట్టును తరలించేందుకు వాహనంలోకి ఎత్తారు. అందుకు రెండు 70 టన్నుల సామర్థ్యమున్న క్రేన్లను ఉపయోగించారు. ఆదివారం అర్ధరాత్రి 12.10 గంటలకు వృక్షాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేసి తిరిగి ప్రాణం పోశారు. అంతకుముందే మర్రిచెట్టుకు ఉన్న రెండు పెద్ద కొమ్మలను వేరు చేసి తంగళ్ళపల్లి మండలం పరిధిలోని జిల్లెల్ల అటవీప్రాంతంలో నాటించారు.
మంత్రి కేటీఆర్ ఆశీస్సులతోనే..
మంత్రి కేటీఆర్ ఆశీస్సులతోనే మర్రి చెట్టు ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు మార్గం సుగమం అయ్యింది. చెట్లు ఉంటేనే మానవ మనుగడ అన్న సీఎం కేసీఆర్ మాటలను త్రికరణ శుద్ధిగా నమ్మి, సవాలుతో కూడిన ఈ పనిని దిగ్విజయంగా పూర్తి చేశాం. సహకరించిన జిల్లా కలెక్టర్, వాటా పౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు. చెట్టును బతికించాలన్న ప్రకాశ్ ఆశయం గొప్పది.
– ఎంపీ సంతోష్‌కుమార్