హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : ఇప్పటికే డిసెండింగ్ ఆర్డర్‌ను పాటించకుండా, రిలిక్విష్మెంట్ను అమలు చేయకుండా గురుకు ల అభ్యర్థులకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ సర్కార్.. తాజా నిర్ణయంతో వారిని మరింత నిరాశపరిచింది. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని వివిధ క్యాడర్లలో డైరెక్టు రిక్రూట్మెంట్ పోస్టులను 30 శాతానికే పరిమితం చేసింది. 70% పోస్టులను ప్రమోషన్ల ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇటీవల సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్(బీజీ)లో ప్రతిపాదనలకు ఆమోదం తె లుపగా, తాజాగా ఉత్తర్వులను ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ శారద జారీచేశారు. ఈ ఉత్తర్వు లు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, గురుకుల పాఠశాలలు, సీ వోఈలు, ప్రత్యేక గురుకులాలు అన్నీ కలిపి 268 గురుకులాలు ఉన్నాయి.
అందులో లెక్చరర్లు, ప్రిన్సిపాల్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్ తదితర కీలక పోస్టులున్నాయి. ఆయా పోస్టులను తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రి క్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ఆధ్వర్యంలోనే భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీలో ఆయా పోస్టుల భర్తీకి సర్వీస్ రూల్స్, నియామక విధివిధానాల నిబంధనలకు కీలక సవరణలు చే సింది. ఆయా ప్రతిపాదనలపై ఇటీవల నిర్వహించిన సొసైటీ బీజీ మీటింగ్‌లో ఆమోదం తెలుపగా, తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. మొత్తంగా ఎస్సీ గురుకుల సొసైటీలో డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులను భారీగా కుదించింది. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, పీడీ గ్రేడ్-2 పోస్టుల్లో కేవలం 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. 70% పోస్టులను ప్రమోషన్ల ద్వారానే భర్తీ చేస్తారు. డిగ్రీ ప్రిన్సిపాల్, గ్రేడ్-1 ప్రిన్సిపాల్ పోస్టులను 100% ప్రమోషన్ల ద్వారానే భర్తీ చేసేలా నిబంధనలను సవరించింది.
ఏ సొసైటీలో లేని విధంగా పలు ఉన్నతస్థాయి పోస్టుల నియామకానికి సంబంధించి ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీకి ఉన్న అధికారాలకు సైతం ప్రభుత్వం కత్తెర వేసింది. ఎస్సీ గురుకుల సొసైటీ చైర్మన్‌గా వ్యవహరించే ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రికే ఆ నియామక అధికారాలను కట్టబెట్టిం ది. అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, గ్రేడ్-1, గ్రేడ్-2 ప్రిన్సిపాల్ నియామకానికి సంబంధించి పూర్తి అధికారాలు ఇప్పటివరకు సొసైటీ వైస్ చైర్మన్, (సెక్రటరీ)కి ఉన్నాయి. ప్రస్తుతం వైస్ చైర్మన్, సెక్రటరీ అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేసింది. చైర్మన్‌గా వ్యవహరించే మంత్రికి నియామక అధికారాలను కట్టబెట్టింది. ఈ మేర కు బీజీలో నిర్ణయించింది. సంబంధించిన ఉత్తర్వులను సొసైటీ సెక్రటరీ తాజాగా జారీ చేశారు. సొసైటీ జోనల్ సిస్టమ్‌లో కూడా పలు మార్పు లు చేశారు. ప్రస్తుతం 7జోన్లు, 2 మల్టీజోన్లు, 1 స్టేట్ ఆఫీసర్ పోస్టు ఉన్నాయి. అయితే, వాటిని యథాతథంగానే కొనసాగిస్తూ, జోన్ 3, 4, 6ను మాత్రం ఈస్ట్, వెస్ట్గా విభజించింది. గురుకుల సీట్ల కేటాయింపునకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయాలని నిర్ణయించింది.
