Telangana | హైదరాబాద్/ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం/ మలుగు, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇసుక అక్రమ దందా వెనుక ఎవరున్నారు? ఇసుక దందా నడుపుతున్నది మంత్రులా? లేదా వారి పీఏలా..? ఖమ్మం ఇసుక మాఫియాలో పాత్రదారులెవరు? సూత్రదారులెవరు? మంత్రి సీతక్క పీఏ పోస్టు ఊస్టు..? అంటూ ఓ వైపు సోషల్ మీడియాలో ప్రచారం.. జరుగుతుండగానే తాజాగా మరోవైపు మరో ఏడు ఇసుక లారీలు పట్టుబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం ఏడు ఇసుక లారీలను సీజ్‌చేశారు. ఆంధ్రా నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ తరలింపుపై ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న కథనాలకు అధికారులు స్పందించారు. భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక జిల్లా అధికారులతో రెండు రోజుల నుంచి సమావేశాలు ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు. బూర్గంపహాడ్ మండలంలో వారం క్రితం పట్టుకున్న 17 ఇసుక లారీల్లో ఐదు లారీలను పోలీసుల కళ్లుగప్పి డ్రైవర్లు తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అధికారులు ఇసుక లారీలకు జరిమానా కూడా విధించకపోవడం గమనార్హం. సీజ్ చేసిన ఇసుక లారీలను ఏదో ఒక పోలీస్‌స్టేషన్‌లో ఉంచాలి. బూర్గంపహాడ్ పోలీస్‌స్టేషన్‌లో రెండు లారీలు ఉండగా, పాల్వంచకు నాలుగు లారీలను తరలించారు. మిగతా లారీలను ఎక్కడ ఉంచారో కూడా అధికారులు చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల భిన్న వివరణలు
కనిపించకుండా పోయినట్టు ప్రచారం జరుగుతున్న ఐదు లారీలను కూడా స్వాధీనం చేసుకున్నామని మైనింగ్ ఏడీ జైసింగ్ చెప్పగా.. తమ వద్దకు 12 లారీలే వచ్చాయని రవాణాశాఖ జిల్లా అధికారి వేణు సమాధానమివ్వడం గమనార్హం. 12 లారీలపైనే కేసులు నమోదు చేశామని, వాటికే జరిమానా విధించామని ఉన్నతాధికారులకు డీటీవో నివేదిక పంపారు. ఇద్దరు అధికారులు చెరోలా చెప్పడంలో ఐదు లారీల విషయంలో గోప్యత పాటిస్తున్నట్టు తెలుస్తున్నది. కాగా, శనివారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరో ఏడు లారీలను పట్టుకున్నారు. ఓవర్‌లోడ్‌తో వస్తున్న లారీలను పాల్వంచ మండలం నాగారం చెక్‌పోస్టు వద్ద పట్టుకొని పాల్వంచ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇసుక అక్రమ వ్యవహారం ఇలా ఉంటే ఓవర్‌లోడ్‌తో ఇసుక రవాణా కూడా యథేచ్ఛగా కొనసాగుతున్నది.
మంత్రి సీతక్క పీఏ తొలగింపు
ఇసుక దందా వ్యవహారంలో మంత్రి సీతక్క వద్ద పీఏగా పనిచేస్తున్న సుజిత్‌రెడ్డిని తొలగించినట్టు సమాచారం. ఈ నెల 15న ‘పేరు సర్దార్’.. దందా జోర్దార్’ అనే శీర్ష్షికతో ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ఇసుక దందాపై కథనం ప్రచురితమైంది. ముఖ్యమంత్రి ఫొటో పెట్టుకొని ఏపీ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 17 లారీలను అధికారులు అడ్డుకోగా, మంత్రి పీఏనంటూ, సీఎం కార్యాలయం సూచన మేరకు మంత్రి వద్ద పని చేస్తున్నానని చెప్పి పలుమార్లు ఫోన్ చేసి లారీలను వదలాలనడం, ఈ విషయం బయటకు పొక్కడంతో పీఏను విధుల నుంచి మంత్రి సీతక్క తొలగించినట్టు తెలుస్తున్నది.