హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి, ఇంటర్, ఎప్‌సెట్ ఇలా ఏ ఫలితాలు తీసుకున్నా అమ్మాయిలదే హవా. కానీ ఈ సారి లాసెట్ ఫలితాల్లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. లా, పీజీ లాసెట్ ఫలితాల్లో మాత్రం పురుషులదే హవాగా సాగింది. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి బుధవారం లాసెట్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తంగా 66.46% ఉత్తీర్ణత నమోదయ్యింది. పురుషులు అత్యధికంగా 68.38% క్వాలిఫై కాగా, మహిళలు 62.49% ఉత్తీర్ణులయ్యారు. కోర్సులవారీగా తీసుకుంటే మూడేండ్ల లాసెట్‌లో 67.61%, ఐదేండ్ల లాసెట్‌లో 51.83%, పీజీలాసెట్‌లో 90.33% చొప్పున అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన ఎల్కూచి రుతిక టీజీ లాసెట్ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించింది. 120 మార్కులకు 85 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది.
బీటెక్ నుంచి లా వైపు..
రాష్ట్రంలో ఇంజినీర్లు, ఫార్మాసిస్టులు, డాక్టర్లు లా కోర్సుల్లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆర్ట్స్ కోర్సుల్లోని విద్యార్థులు లా కోర్సుల్లో చేరడం సహజం. కానిప్పుడు బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి కోర్సుల్లోని విద్యార్థులు మూడేండ్ల లా కోర్సులో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బీకాం పూర్తిచేసిన వారు 5,971 మంది క్వాలిఫై అయితే, బీఈ/బీటెక్ వాళ్లు 5,182 మంది క్వాలిఫై అయ్యారు. అంటే బీకాం తర్వాత బీటెక్ వాళ్లే అత్యధికంగా క్వాలిఫై అయ్యారు. ఇక బీఎస్సీ నుంచి 5,167 మంది, బీఏ నుంచి 4,043 మంది చొప్పున క్వాలిఫై అయ్యారు. మూడేండ్ల లాలో ఎంబీబీఎస్ డాక్టర్లు 79, బీహెచ్ఎంఎస్ 15, బీ ఫార్మసీ 384 మంది చొప్పున క్వాలిఫై అయ్యారు.
ఆరు పదుల వయసులోనూ..
లా కోర్సులో చేరేందుకు 16 ఏండ్ల వారి నుంచి 60 ఏండ్ల ముసలి వరకు పోటీపడుతున్నారు. ఈ సారి 51-60 ఏండ్ల మధ్య వయస్కులు కూడా పరీక్షలు రాసి క్వాలిఫై అయ్యా రు. ఇలాంటి వారు మూడేండ్ల ఎల్ఎల్బీ ప్రవే శ పరీక్షలో 544 మంది క్వాలిఫై అయ్యారు. ఐదేండ్ల లాలో 41, ఎల్ఎల్ఎం కోర్సు ప్రవేశ పరీక్షలో 155 మంది క్వాలిఫై అయ్యారు. 60 ఏండ్లు దాటిన వారు మూడేండ్ల ఎల్ఎల్బీలో 247 మంది, ఐదేండ్ల ఎల్ఎల్బీలో 11 మం ది, ఎల్ఎల్ఎం కోర్సులో 75 మంది చొప్పున క్వాలిఫై అయ్యారు.