హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎవరైనా దవాఖానల్లో మరణిస్తే.. ఆ పార్థివ దేహాన్ని ఇంటికి తరలించడం పెద్ద సమస్యగా మారిన రోజులివి. మృతదేహాలను తరలించాలంటే ప్రైవేట్ వాహనదారులు సాధారణ చార్జీల కన్నా మూడునాలుగు రెట్లు అదనంగా డిమాండ్ చేస్తుంటారు. ఓవైపు ఆప్తులను కోల్పోయామన్న బాధ గుండెను పిండేస్తుంటే.. మరోవైపు పార్థివ దేహాలను తరలించేందుకు డబ్బు లేక అవస్థ పడేవారు ఎందరో. ఈ వేదనను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్.. ఉచితంగా పార్థివ దేహాలను తరలించేందుకు ‘హర్స్’ వెహికిల్స్ (పరమపద వాహనాలు) పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ దవాఖానల్లో ఎవరైనా మరణిస్తే.. అప్పటికే అనుకోని కష్టంతో కుమిలిపోతున్న కుటుంబానికి ఆర్థికంగా మరింత నష్టం కలుగకుండా కాపాడాలన్నది ఈ పథకం ఉద్దేశం. పార్థివ దేహాన్ని ప్రభుత్వ వాహనంలో ఉచితంగా ఇంటివరకు తరలించాలని నిర్ణయించారు. 2016 నవంబర్‌లో ప్రారంభమైన ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అద్భుతమైన సేవలు అందిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 63,554 పార్థివ దేహాలను ప్రభుత్వం దవాఖాన నుంచి గౌరవంగా ఇంటి వరకు తరలించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 36 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరికొన్ని వాహనాలు ప్రవేశపెట్టనున్నారు.
రూ.25 కోట్లకుపైగా ఆదా
దవాఖాన నుంచి ఇంటికి పార్థివ దేహాన్ని ప్రైవేట్ వాహనంలో తరలించాలంటే కనీసం రూ.2 వేలు వసూలు చేస్తుంటారు. దూరాన్ని బట్టి ఈ ధర పెరుగుతుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు అయితే రూ.10 వేలకు పైనే ఖర్చవుతుతుంది. కాబ్టటి సగటున ఒక్కో పార్థివ దేహాన్ని తరలించడానికి సుమారు రూ.4 వేలు ఖర్చవుతుందని భావించినా.. ఇప్పటివరకు పరమపద వాహనాల్లో తరలించిన 63,554 పార్థివ దేహాల ద్వారా బాధిత కుటుంబాలకు సుమారు రూ.25 కోట్లకుపైగా ఆదా అయినట్టేనని అధికారులు చెప్తున్నారు.