కొల్లాపూర్, మే 21 : ఓ వైపు భానుడి భగభగలు కొనసాగుతున్నా.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం శివారులోని అటవీ ప్రాంతంలో గురువారం అరుదైన ఘట్టం చోటుచేసుకున్నది. చేతిలో పారలు, తట్టలతో చెమటోడుస్తున్న ఉపాధి కూలీల సమూహం పని ప్రదేశంలోనే ఓ వృద్ధ దంపతుల షష్ఠిపూర్తికి సరికొత్త పెళ్లి పందిరిని సిద్ధం చేశారు. రామాపూరానికి చెందిన ఆకునమోని వెంకటయ్య- నీలమ్మ వృద్ధ దంపతులకు రెక్కల కష్టమే తెలుసు.. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆరుపదుల వయసులోనూ ఉపాధిహామీపనికి వెళ్తూ కష్టంలోనే ఆనందాన్ని వెతుక్కునే ఆ వృద్ధ దంపతులకు తోటి కూలీలు ఆత్మీయ ఘట్టాన్ని ఆవిష్కరించారు. ఎండ తగలకుండా కట్టుకున్న టార్పాలిన్ కవర్ కిందనే కల్యాణ మంటపం ఏర్పాటు చేశారు.
పని ప్రదేశంలో లభించిన తంగేడు పూలతో పాటు ఇతర చెట్ల పూలతో బాసికాలు కట్టి, పూలదండలతో వెంకటయ్య- నీలమ్మను వధూవరులుగా అలంకరించి ముస్తాబు చేశారు. తోటి కూలీల చప్పట్లు, నవ్వులే వాయిద్యాలుగా సంప్రదాయబద్ధంగా పూలదండలు మార్పించి, అడవిలో దొరికిన వివిధ రకాల పూలతోనే అక్షింతలు వేసి దీవించారు. మహిళలు మంగళహారతులతో పాటలు పాడి సందడి చేశారు. వృద్ధ దంపతులకు షష్ఠిపూర్తి కార్యక్రమాన్ని నిర్వహించి వెలకట్టలేని ఆత్మీయతను అందించారు. కరువుపనిలోనూ కమ్మని బంధాలను పెంచి పోషిస్తున్న రామాపురం ఉపాధి కూలీల ఆత్మీయతపై చుట్టుపక్కల గ్రామాల్లో ప్రశంసల జల్లు కురుస్తున్నది.