Kodada | కోదాడ: ప్రయాణ సమయాల్లో మహిళలు, వృద్ధులకు విద్యార్థినులకు మెరుగైన భద్రత కల్పించడమే తమ విధి. ‘మై ఆటో ఈజ్ సేఫ్ (My Auto Is Safe)’ కార్యక్రమంలో భాగంగా ఆటోలకు క్యూఆర్ కోడ్ రక్షణ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నాం అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. కోదాడలోని కాశీనాథం ఫంక్షన్ హాల్లో బుధవారం ఆటో డ్రైవర్లు, విద్యార్థినులకు ప్రయాణ భద్రతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ప్రయాణించే మార్గంలో ఇబ్బందులు ఎదురైతే ఆటోలకు ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, ఎమర్జెన్సీ బటన్ నొక్కితే సంబంధిత పోలీస్ శాఖ అప్రమత్తమై రక్షణ కల్పిస్తుందని అన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ విధిగా లైసెన్స్ కలిగి ఉండి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

Auto Qr Code
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు శాఖ అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజల రక్షణ భద్రత పోలీస్ శాఖ లక్ష్యం అని పేర్కొన్నారు. ఆటోడ్రైవర్లలో విద్యావంతులు ఉన్నారని, వారు సమాజాన్ని చైతన్యం చేయడలో భాగస్వాములు కావాలని కోరారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతిఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరేందుకు అరైవ్ అలైవ్ (Arive Alive) అవగాహన కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా చేపడుతున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఉన్నత భవిష్యత్తు చేరుకోవచ్చు అని వెల్లడించారు. దేశ భవిష్యత్తులో యువత ప్రధాన భూమిక పోషించాలని కోరారు. మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న, వినియోగిస్తున్న వారి సమాచారాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని విన్నవించారు. 8 ఆటోలకు క్యూఆర్ కోడ్ రక్షణ స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పట్టణ సీఐ శివ శంకర్ నాయక్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, మై ఆటో ఈజ్ సేఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ రమేశ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.