హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): గోదావరి, కృష్ణా నదుల నుంచి 45 రోజుల్లో సుమారు 600 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. సాధారణంగా జూలై ఒకటో తేదీ నుంచి నీటి సంవత్సరంగా పరిగణిస్తుంటారు. గోదావరి నదికి ధవళేశ్వరం చివరి ఆనకట్ట కాగా, కృష్ణానదికి విజయవాడలోని ప్రకాశం బరాజ్ చివరిది. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ధవళేశ్వరం బరాజ్ ద్వారా 302.53 టీఎంసీలు సముద్రంలోకి చేరాయి. బరాజ్ పూర్తిగా నిండి ఉన్నది.
ఎగువ నుంచి వచ్చిన నీటిని కిందికి వదులుతున్నారు. ఉదయం ఇన్‌ఫ్లో 15.04 లక్షల క్యుసెక్కులు నమోదుకాగా.. ఔట్‌ఫ్లో 15.07 క్యుసెక్కులుగా ఉన్నది. ఎస్సారెస్పీ మొదలు తెలంగాణలో ఎగువన ఉన్న బరాజ్లన్నీ పొంగి పొర్లుతున్నాయి. గురువారం సాయంత్రానికి తుపాకులగూడెం వద్ద సుమారు 28 లక్షల క్యుసెక్కుల ఔట్‌ఫ్లో ఉన్నది. ఇవి శుక్రవారం ధవళేశ్వరానికి చేరుకుంటాయి. అక్కడి నుంచి సముద్రంలో కలుస్తాయి. అంటే అదనంగా మరో సుమారు 280 టీఎంసీలు సముద్రంపాలు కాబోతున్నాయి. మొత్తంగా శుక్రవారం నాటికి గోదావరి నుంచి సుమారు 580 టీఎంసీలకుపైగా సాగరంలో కలువబోతున్నాయి. మరోవైపు కృష్ణానది నుంచి ఇప్పటికే సుమారు 11 టీఎంసీల నీరు సముద్రంలోకి చేరింది. వంశధార నది నుంచి 2.85 టీఎంసీలు గొట్టా బరాజ్ ద్వారా సముద్రంలోకి కలిశాయి.
గత నీటి సంవత్సరంలో (2021 జూన్ 1 నుంచి 2022 మే 31) మూడు నదుల నుంచి మొత్తం 3,057 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఇందులో గోదావరి జలాలే అత్యధికం. గోదావరి నుంచి 2,502.25 టీఎంసీలు, కృష్ణా నది నుంచి 501.36 టీఎంసీలు, వంశధార నది నుంచి 53.56 టీఎంసీలు సముద్రంలో కలిశాయి.