Fire Accident | ఊట్కూర్, మార్చి 14 : మండలంలోని ఓబులాపూర్ శివారు అడవిలో జరిగిన అగ్ని ప్రమాదంలో గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డ ఘటన చోటు చేసుకుంది. బాధిత గొర్రెల కాపరుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన గొర్రెల కాపరులు కురువ అయ్యలప్ప, బలరాం, జన్నప్ప, ఎర్ర కొండప్ప, తిప్పన్న తమ గొర్రెలను మండలంలోని ఓబులాపురం శివారులో శుక్రవారం మేతకు వదిలారు. ఇదే క్రమంలో 70 వరకు గొర్రె పిల్లలను వెటర్నరీ అధికారి భీమ్ రెడ్డి వ్యవసాయ పొలంలో ఇనుప కంచె పెట్టి ఉంచారు. గొర్రె పిల్లలు కుక్కల బారిన పడకుండా రక్షణగా చుట్టూ పెద్ద మొత్తంలో ముళ్లకంచెను పెట్టడంతో ప్రమాదవశాత్తు ముళ్ళకంచెకు నిప్పంటుకొని దాదాపు 60 గొర్రె పిల్లలు ఘటనాస్థలిలోనే మృత్యువాత పడినట్లు యజమానులు తెలిపారు. గొర్రె పిల్లలు మృత్యువాత పడిన ఘటనలో యజమానులకు రూ. 3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మాదాసి కురవ సంఘం జిల్లా నాయకులు గోవిందప్ప, ఆశప్ప తెలిపారు. ఈ సందర్భంగా బాధిత గొర్రెల కాపరులను పరామర్శించి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.