హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో అత్యవసర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లు కేటాయించింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్ చార్జీలు, తాతాలిక సిబ్బందికి జీతాలు, మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు సోమవారం గురుకుల హాస్టళ్లపై సమీక్షించిన సీఎం రేవంత్రెడ్డి.. హాస్టళ్లకు కేటాయించిన నిధుల చెకులను ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యార్థులకు పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానలను హాస్టళ్లతో అనుసంధానించాలని సూచించారు. కొద్ది నెలలుగా గురుకులాల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూ.60 కోట్లు ఏ మూలకు సరిపోతాయని, వీటితో గురుకులాల్లో ఏం అభివృద్ది చేయొచ్చనే విమర్శలు వస్తున్నాయి.