హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘ఒమిక్రాన్ అయినా.. వేరియంట్ ఏదైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధం’ అని రాష్ట్ర వైద్య రంగం ధీమా వ్యక్తం చేస్తున్నది. మొదటి, రెండో వేవ్ అనుభవాలతో ప్రభుత్వం ముందస్తుగా వైద్యరంగాన్ని అప్రమత్తం చేసింది. మూడోవేవ్ ఎప్పుడు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వసతులు కల్పించింది. ప్రాణాధార ఔషధాల కొరత రాకుండా సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచింది. అందుకే ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నా సరే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ‘ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని భరోసా ఇస్తున్నది. అదే సమయంలో ప్రజలు మాస్కులు, భౌతిక దూరం వంటి కొవిడ్ జాగ్రత్తలు పాటిచడంతోపాటు రెండు డోసుల టీకాలు వేసుకొని సహకరించాలని కోరుతున్నది.
ముప్పు ఏ రూపంలో వచ్చినా..
మూడోవేవ్‌లో సంక్రాంతి నుంచి కేసులు పెరుగుతాయని, ఫిబ్రవరిలో ఉచ్ఛస్థితికి చేరుకుంటాయని చెప్తున్నారు. దీంతో ముప్పు ఏ రూపంలో, ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రెండు రకాల చర్యలు తీసుకున్నది. పిల్లలు ప్రభావితం అవుతారన్న అంచనా మేరకు.. చిన్నారుల సంరక్షణ కోసం అన్ని జిల్లాల్లో కలిపి ప్రత్యేకంగా 6 వేల పడకలను అందుబాటులో ఉంచింది. వీటన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం ఉన్నది. ఇందులో హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 1600 పడకలను సిద్ధం చేసింది. నిలోఫర్ దవాఖానను నోడల్ సెంటర్‌గా నియమించి.. ప్రత్యేకంగా 800 పడకలను కేటాయించింది. పెద్దలు ప్రభావితం అయితే వేగంగా చికిత్స అందించేందుకు హోం ఐసొలేషన్ కిట్లను తయారు చేయించింది.
అందుబాటులో ప్రాణాధార మందులు..
మొదటి, రెండోవేవ్ అనుభవాల ఆధారంగా ప్రభుత్వం ప్రాణాధార మందులను సిద్ధంగా ఉంచింది. పరీక్షల కోసం ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను, చికిత్స కోసం పీపీఈ కిట్లు, మాస్కులు వంటివాటిని నిల్వ చేసింది.
ఆక్సిజన్‌పై త్రిముఖవ్యూహం
ప్రభుత్వం ఆక్సిజన్ విషయంలో త్రిముఖ వ్యూహాన్ని రచించింది.అన్నీ ఆక్సిజన్ బెడ్లే: ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న బెడ్లు అన్నింటినీ ‘ఆక్సిజన్ బెడ్లు’గా మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 25,390 పడకలు ఆక్సిజన్ బెడ్లుగా మారాయి.
ఉత్పత్తి సామర్థ్యం పెంపు: ప్రభుత్వ దవాఖానల్లో 76 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటుచేసింది.
తద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు
135 మెట్రిక్ టన్నుల నుంచి 327 మెట్రిక్ టన్నుకులకు పెంచింది. ప్రభుత్వ సూచన మేరకు ప్రైవేట్ దవాఖానల్లో 39 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి.
వేగంగా రవాణా: అదనంగా ఆక్సిజన్ అవసరం అయితే వేగంగా రవాణా చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. ద్రవ ఆక్సిజన్ రవాణా కోసం 540 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 27 ఐఎస్వో కంటైనర్లను సిద్ధం చేసింది.
ప్రజలు బాధ్యతగా సహకరించాలి
ఒమిక్రాన్ సహా కరోనాలో ఏ కొత్త వేరియంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసింది. ప్రజల సహకారం లేకుంటే ముప్పును ఎదుర్కోవడం కష్టం. ప్రజలు కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి. టీకాలు రెండు డోసులు తీసుకోవాలి.