హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ: మార్ఫిన్ కంటే వంద రెట్లు, హెరాయిన్ కంటే 50 రెట్లు అధికంగా ప్రభావం చూపే ఫెంటానిల్ అనే డ్రగ్‌ను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు గురువారం సీజ్ చేశారు. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఆసిఫ్‌నగర్‌లో సుమారు రూ.6.08 లక్షల విలువైన 57 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. సమీర్ హాస్పిటల్లో అనస్థిషీయా వైద్యుడు హన్సాన్ ముస్తఫాఖాన్ తన భార్య లుబ్నా నజీబ్ఖాన్తో కలిసి అక్రమంగా మత్తు మందులు విక్రయిస్తున్నాడు.
ఈ ఫెంటానిల్ అనే సింథటిక్ డ్రగ్‌ను శస్త్రచికిత్సల సమయంలో, ఆపరేషన్ల తర్వాత తీవ్రమైన నొప్పులతో బాధపడే రోగులకు ఇస్తారు. డాక్టర్ దంపతులు అక్రమంగా ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు టీఎస్ న్యాబ్ పోలీసులు నెలరోజులుగా వారిపై నిఘా పెట్టారు. గురువారం ఓ వినియోగదారుడు డాక్టర్ దంపతులకు ఒక బాక్స్ ఇంజెక్షన్ల కోసం రూ.17,500 డబ్బులు పంపడంతో డెలివరీ కోసం పోర్టర్ యాప్ బాయ్ రావడాన్ని గమనించిన హన్సాన్ ముస్తఫాఖాన్ భార్యతోపాటు డ్రగ్స్ బానిసైన ఓ వినియోగదారుడిని అరెస్టు చేశారు.
వారి నుంచి 57 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితమే డాక్టర్ ముస్తఫా కువైట్ వెళ్లడంతో అతడి రాక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. అతడు ఇప్పటి వరకు ఎవరెవరికీ డ్రగ్స్ అమ్మాడు? అతని ఖాతాలో ఎంతమంది వినియోగదారులు ఉన్నారు? అనే విషయాలు రాబట్టనున్నారు. మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నారని తెలిస్తే 8712671111 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని టీఎస్ న్యాబ్ పోలీసులు కోరారు.