హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యువతుల పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడిన 431 మందిని అక్కడికక్కడే అరెస్టు చేసి జైలుకు పంపినట్టు ఉమెన్ సేఫ్టీవింగ్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. బుధ, గురువారాల్లో ఒక్క హైదరాబాద్ ట్యాంక్‌బండ్ నిమజ్జన ప్రాంతంలోనే 84 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
వీరిలో కొందరికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఇండ్లకు పంపామని తెలిపారు. రద్దీ ప్రాంతాలు, నిమజ్జన ప్రదేశాల్లో మఫ్టీలో షీటీమ్స్ బృందాలు స్పై కెమెరాలతో విధులు నిర్వర్తించాయి. ఆకతాయిల వికృత చేష్టలను రికార్డు చేస్తూ.. ఆధారాలతో సహా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. సరిగ్గా ఇలాంటి వేధింపులకు సంబంధించి ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,789 (హైదరాబాద్‌లో 976) మందిని అరెస్టు చేసినట్టు అధికారులు వివరించారు.
పోకిరీలు, ఆకతాయిల వికృత చేష్టలను చూస్తూ భరించవద్దని, అలాంటి వారి సమాచారాన్ని తమకు వెంటనే తెలియజేయాలని ఉమెన్ సేఫ్టీవింగ్ ఏడీజీ శిఖాగోయెల్ చెప్పారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే తక్షణమే 100కు కాల్ చేయాలని ఆమె కోరారు.