రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 4( నమస్తే తెలంగాణ) : సహకార విద్యుత్తు సరఫరా సంఘం సిరిసిల్ల (సెస్)ను ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా కాపాడుకుంటామని, విలీనానికి ఒప్పుకోబోమని చైర్మన్ చిక్కాల రామారావు స్పష్టం చేశారు. శనివారం సిరిసిల్ల శివారులోని సాయి మణికంఠ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సెస్ 52వ మహాజన సభలో రామారావు మాట్లాడారు. సెస్ లైసెన్స్ కోసం డిసెంబర్లోనే ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. మార్చి 31 గడువు ముగియగానే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్టీపీసీఎల్ అధికారులు సెస్ కార్యాలయంలో చొరబడి, పోలీస్ బలగం పెట్టుకొని మీటింగ్‌లు పెట్టారని మండిపడ్డారు.
ఇప్పటి వరకు లైసెన్స్ రెన్యువల్ ఎందుకు పెండింగ్ పెట్టిందో చెప్పలేదని, తమకు నోటీసులు ఇవ్వకుండానే సెస్‌లో చొరబడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 1969లో అప్పటి రాజకీయ ప్రత్యర్థులైన దివంగత ఎమ్మెల్యేలు చెన్నమనేని రాజేశ్వర్‌రావు, జువ్వాడి నర్సింగరావు ఇక్కడి మెట్టప్రాంతమైన సిరిసిల్ల రైతులు, చేనేత కార్మికుల కోసం దేశంలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద సహకార విద్యుత్తు సరఫరా సంస్థను స్థాపించారని గుర్తుచేశారు. సెస్ 56 ఏండ్లుగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందిందని తెలిపారు.
జాతీయ స్థాయి అవార్డులు సైతం దక్కించుకున్నదని చెప్పారు. నష్టాల్లో ఉందని, అవినీతి అంటూ దుష్ప్రచారం చేస్తూ పథకం ప్రకారం విలీనానికి కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. ఘనకీర్తి ఉన్న సిరిసిల్ల సెస్‌ను కాపాడుకుంటామని, సెస్ పాలకవర్గంతోపాటు ప్రతినిధులు, వినియోగదారుల సహకారంతో న్యాయపోరాటానికి సిద్ధమయ్యామని చెప్పారు. సెస్ పరిధిలోని అన్ని మండలాలు, పట్టణాల నుంచి సెస్‌ను విలీనం చేయవద్దని, యధావిధిగా కొనసాగించాలని తీర్మానాలు చేసి మహాజనసభలో అందించారని పేర్కొన్నారు. విలీనం వద్దంటూ చేసిన తీర్మానాలు, మహాజనసభలో కరతాళ ధ్వనులతో సెస్ ప్రతినిధులు మద్దతు పలికారు.