మహబూబ్‌నగర్, జనవరి 12 : రిటైర్డ్ ఏఆర్ ఎస్సై పోరాటం ఫలించింది. ఏఆర్ ఎస్సైగా పనిచేసి రిటైర్ అయిన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పుర్కు చెందిన సాధిక్ బెనిఫిట్ డబ్బుల కోసం ఎనిమిది నెలలుగా ఎదురు చూస్తున్నాడు. అప్పుల పాలైన ఆయన ఎవరికి ముఖం చూపించలేక తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు జీవితంపై విరక్తి చెందిన సాధిక్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఎక్కడో ఉండి వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంటానని ఈ నెల 8న సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అదే విషయాన్ని ఈ నెల 9న నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందిస్తూ వెంటనే బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి సాధిక్‌కు రూ.52 లక్షల బెనిఫిట్స్ విడుదల చేశారు. ఇందులో గ్రాట్యూటీ రూ.16 లక్షలు, కమిటెడ్ లీవ్స్ రూ.18.80 లక్షలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ రూ.13.68 లక్షలు, జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ రూ.3.93 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా 2024 మార్చి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రిటైర్డ్ అయిన వారు వందల్లో ఉన్నారు. ఇప్పటివరకు తమకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకూ వెంటనే ప్రయోజనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.