రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏది మాట్లాడినా, ఏం చేసినా.. ఏదీ చెయ్యకపోయినా.. దాని వెనుక ఒకే ఒక మిషన్ ఉంటది. అదే కమీషన్. క్యాబినెట్లో ప్రజలకు ఎట్ల మేలు చేయాలె, రాష్ట్రాన్ని ఎట్ల బాగు చేయాలె అని ఆలోచించాలె. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం.. తమకు తాము ఎట్ల మేలు చేసుకోవాలె. ఏ ప్లాన్ వేసి కమీషన్లు కొల్లగొట్టాలె, వాటాలు ఎట్ల పంచుకోవాలని మాత్రమే ఆలోచిస్తున్నది. -హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది స్కాముల సర్కారుగా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. నిన్న దేశంలోనే అతిపెద్ద భూ స్కాం బయటపడితే.. నేడు మరో రూ.50 వేల కోట్ల పవర్ స్కాం వెలుగుచూసిందని మండిపడ్డారు. ఇందులో దాదాపు 30-40% కమీషన్లు దండుకోబోతున్నరని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రతి పని వెనుక ఒక మిషన్ ఉంటదని, అదే కమీషన్ అని ఎద్దేవా చేశారు. మొన్నటి క్యాబినెట్ మీటింగ్‌లో భూముల గురించి చర్చ జరిగితే, నిన్నటి క్యాబినెట్లో పవర్ స్కామ్ గురించి చర్చ జరిగిందని, మంత్రివర్గం సామ్‌ల గురించి తప్ప, సీంల గురించి చర్చించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
4.12 రూపాయలకే యూనిట్ విద్యుత్తు ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపిన ఎన్టీపీసీని కాదని, ఒక్కో యూనిట్‌కు రూ.9-10 ఖర్చు అయ్యే జెన్కో నుంచి విద్యుత్తు తీసుకోవడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. మరో కొత్త డిసం ఏర్పాటు చేస్తామడం ప్రైవేటీకరణ కోసమేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ వెనుక బీజేపీ లేకుంటే తక్షణమే విద్యుత్తు స్కామ్‌పై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
అవినీతి కంపు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే అరాచకం రాజ్యమేలుతుందని కేసీఆర్ చెప్పారని, ఆయన చెప్పిన ప్రతి మాట ఇవాళ అక్షర సత్యమని రుజువైందని హరీశ్‌రావు గుర్తుచేశారు. ‘వాటాల కోసం మంత్రులు తన్నుకుంటున్నారు. మంత్రుల కుటుంబసభ్యులే రోడ్లమీదికొచ్చి వాటాల మీద వచ్చిన తేడాల గురించి చెప్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో సకల వర్గాల సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా, దేశానికి ఆదర్శంగా నిలిపాం. ఇవాళ.. బడా సామ్‌లు, సకల దరిద్రాలు, దుర్మార్గాలు, అరాచకాలకు కేంద్రంగా కాంగ్రెస్ పాలకులు మార్చేశారు. రేవంత్‌రెడ్డి పాలన అవినీతితో కంపు కొడుతున్నది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రజలకు ఏదైనా మేలు చేసే పనుల మీద? పేదల కష్టాలు తీర్చే పథకాల మీద? రాష్ట్ర ప్రగతికి దోహదం చేసే నిర్ణయాల మీద క్యాబినెట్‌తో చర్చ జరగాలి. కానీ, వాటాలు, కమీషన్ల కోసం క్యాబినెట్ మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. వాటాలు, పంపకాల్లో తేడా రావడంతో బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నరు. అందుకే దండుపాళ్యం బ్యాచ్ లెక తయారైందని గతంలో ఆరోపించాను. ఇప్పుడదే నిజమని తేలుతున్నది’ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
సూటిగా సమాధానం ఎందుకివ్వరు?
మొన్నటి క్యాబినెట్లో ల్యాండ్‌స్కామ్.. నిన్నటి క్యాబినెట్లో పవర్స్కామ్ ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు పరోక్షంగా బయటపెట్టుకున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ‘మొన్న రూ.ఐదు లక్షల కోట్ల స్కామ్ జరగగా, దీంట్లో ఒక్క సీఎం రేవంత్‌రెడ్డి వాటాయే లేదు. క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది. తామంతా కలిసే స్కామ్ చేస్తున్నట్టు సాక్షాత్తు ప్రెస్‌మీట్‌లోనే బయటపెట్టుకున్నారు’ అని దుయ్యబట్టారు. మంత్రివర్గంలో సామ్‌ల మీద చర్చ తప్ప, సీంల గురించి చర్చించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘రెండేండ్లుగా మీరు చేస్తున్నది డైవర్షన్ డర్టీ పాలిటిక్సే. ల్యాండ్ సామ్‌పై ఎందుకు సూటిగా సమాధానం చెప్పరు. ప్రజల డబ్బులు కాంగ్రెస్ నేతల జేబుల్లోకి వెళుతున్నాయి’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ధరలు పెంచి 15-20 వేల కోట్లు దోచుకొనే కుట్ర
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం థర్మల్ పవర్ ప్రాజెక్టులను కట్టిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఒక మెగావాట్ కాస్ట్ యాదాద్రికి రూ.8.63 కోట్లు, భద్రాద్రికి రూ.9.74 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. ఎన్టీపీసీ కూడా ఒక మెగావాట్‌కు రూ.12.23 కోట్లు వెచ్చించిందని తెలిపారు. కానీ, రేవంత్ సర్కారు నిర్మించబోయే రామగుండం పవర్‌ప్లాంట్ కాస్ట్ పర్ మెగావాట్ రూ.14 కోట్లు అని అంచనా వేశారని, ఇది ఇంతటితో ఆగదని కాస్ట్ మరింత పెరుగుతుందని చెప్పారు. ‘ఎఫ్‌జీడీ (ఫ్యూయల్ గ్యాస్, డీసల్ఫరైజేషన్) నిబంధన ప్రకారం ఆ ప్రాంత ప్రజలకు పర్యావరణ ఇబ్బందులు రావద్దని ఒక మెగావాట్‌కు రూ.1.2 కోట్లు వెచ్చించి పొల్యూషన్ కంట్రోల్ మెకానిజమ్‌ను యాద్రాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ వద్ద ఏర్పాటుచేశాం. యాదాద్రి గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు. అక్కడ మనమే భూములు కొన్నం. అయినా యాదాద్రి ఒక మెగావాట్ కాస్ట్ రూ.7.2 కోట్లు మాత్రమే.
కానీ, రామగుండం దగ్గర రేవంత్ సర్కారు ప్రతిపాదించిన ప్రాజెక్టుకు మెగావాట్‌కు 14 కోట్లు. ఇది కూడా ఇనిషియల్ కాస్ట్. రామగుండం దగ్గర ఎఫ్‌జీడీ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ లేదు. అయినా రూ.14 కోట్లు పెట్టారంటే కాస్ట్ డబుల్. యాద్రాద్రి పవర్‌ప్లాంట్‌ను మేం రూ.7.5 కోట్లతో నిర్మిస్తే.. మీరు రామగుండాన్ని రూ.14 కోట్లు చేశారు. అది పూర్తయ్యేవరకు రూ.16 కోట్లు అవుతుంది. ఒక్కో మెగావాట్‌కు రూ.7 కోట్లు అధికంగా పెట్టారు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. 800 మెగావాట్లు అంటే ప్రతి మెగావాట్‌కు రూ.ఏడు కోట్లు అంటే మొత్తం రూ.5,600 కోట్లు. రామగుండంలో రూ.5,600 కోట్లు, పాల్వంచలో రూ.5,600 కోట్లు, మక్తల్‌లో రూ.5,600 కోట్లు ఇలా మొత్తం రూ.15-20 వేల కోట్లు ధరలు పెంచి బడా సామ్‌కు పాల్పడుతున్నారు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
నాడు వద్దన్నవి.. నేడు ముద్దా?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు థర్మల్ వపర్‌ప్లాంట్ దండుగ అని, వద్దేవద్దని చెప్పిన రేవంత్‌రెడ్డి.. నేడు వాటినే ముద్దంటున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేటీఆర్ అన్నట్టు రేవంత్‌రెడ్డిలో ఇద్దరు మనుషులు ఉంటరు. ఒకటి రాము, ఒకటి రెమో. ఆయనే ఓసారి తప్పు అంటడు, ఆయనే మల్లా రైటు అంటడు. అపరిచితుడి లెక బిహేవ్ చేస్తడు. చంద్రముఖి లెక మారిపోతడు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులు మేము కడుతుంటే అవి దండుగా, కట్టనే కట్టవద్దని అన్నడు. ఇప్పుడు ముద్దు అంటున్నడు. పవర్‌ప్లాంట్ ఏర్పాటు పేరిట అందినకాడికి దండుకునేందుకు మాస్టర్‌ప్లాన్ వేశాడు. కమీషన్ల కకుర్తికి నిలువెత్తు నిదర్శనం ప్లాన్ చేస్తున్న థర్మల్ పవర్‌ప్లాంట్స్. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. మీ సొంత ప్రయోజనాల కోసం, కాంగ్రెస్ కమీషన్ల కోసం కడుతున్న ప్లాంట్లు’ అని హరీశ్‌రావు విమర్శించారు.
కాంగ్రెస్ విద్యుత్తు పాలసీ పచ్చి బూటకం
‘కాంగ్రెస్ సర్కారు తెచ్చిన విద్యుత్తు పాలసీ పచ్చి బూటకం.. చెప్పేదొకటి చేసేది మరొకటి..’ అని హరీశ్‌రావు విమర్శించారు. ‘2026 నాటికి థర్మల్ విద్యుత్తు ఉత్పత్తిని 40% తగ్గిస్తమని శ్వేతపత్రం విడుదల చేస్తరు. 2030-31 వరకు 20 వేల మెగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని తెస్తమని క్లీన్ అండ్ గ్రీన్ పాలసీలో ప్రకటిస్తరు.. ఇకపై థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి చేయబోమని గ్రీన్ఎనర్జీ వైపు వెళ్తున్నమని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే చెబుతారు. కానీ, ఇప్పుడు వేలకోట్లు వెచ్చించి థర్మల్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నరు’ అని దుయ్యబట్టారు. మళ్లీ అధికారం రాదని తెలిసే కాంగ్రెస్ నేతలు బరితెగించి స్కామ్‌లు చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు.
‘రేవంత్‌రెడ్డీ.. నువ్వు అసెంబ్లీలో పెట్టిన కరెంట్ పాలసీకి కట్టుబడి ఉన్నవా? లేదా? తక్కుక ధరకే కరెంట్ వస్తుంటే ఎక్కువ ఉత్పత్తి రేటుతో ప్లాంట్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నవు? ఎన్టీపీసీ తక్కువ ధరకే 2,400 మెగావాట్ల కరెంట్ ఇస్తానని చెప్పింది నిజమా? కాదా? ప్రభుత్వానికి లేఖలు రాసింది వాస్తవమా? కాదా? ఎన్టీపీసీ చైర్మన్ నీ వద్దకు వచ్చి 2,400 మెగావాట్లు తక్కువకే ఇస్తమని చెప్పలేదా? కమీషన్ల కోసమే థర్మల్ ప్లాంట్‌ను తెరపైకి తీసుకొస్తున్నది నిజంకాదా?’ అని ప్రశ్నించారు. వీటన్నింటికీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటీకరణ కోసమే కొత్త డిస్కంలు
లాభాల్లో ఉన్న డిస్కంలను ప్రైవేట్‌పరం చేసేందుకే కొత్త డిస్కంల ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని హరీశ్‌రావు ఆరోపించారు. ఇప్పటివరకు ప్రాంతాలవారీగా డిస్కంలు ఉంటే, ఇప్పుడు పథకాల కోసం డిస్కంలను నెలకొల్పాలని నిర్ణయించడం విడ్డూరమని పేర్కొన్నారు. అసలు ఆదాయమే రాని డిస్కంల నిర్వహణ ఎట్లా సాధ్యం? అప్పులు ఎట్లా వస్తయి? డిస్కంలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు ఏవిధంగా ఇస్తరు? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ డైరెక్షన్లో సీఎం రేవంత్‌రెడ్డి యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. ఎవరిని ఉద్ధరించేందుకు కొత్త డిస్కం తీసుకొస్తున్నారని నిలదీశారు.
పాలన గాలికి..స్కామ్‌లు తెరపైకి..
‘సీఎం రేవంత్‌రెడ్డి పాలనను గాలికొదిలి స్కామ్‌లను తెరపైకి తెస్తున్నారు. పథకాలను బంద్‌పెట్టి వరుస కుంభకోణాలకు పాల్పడుతున్నారు. లగచర్ల, మూసీ, ఆర్ఆర్ఆర్, హెచ్‌సీయూ, హైడ్రా పేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. నిన్న రూ.5 లక్షల ల్యాండ్ స్కామ్‌ను బట్టబయలు చేశాం. నేడు రూ.50 వేల కోట్ల విలువైన పవర్ స్కామ్‌ను పక్కా ఆధారాలతో బయటపెడుతున్నాం. వీటికి సమాధానం చెప్పాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగడం దుర్మార్గం. అధికార పార్టీ నాయకులు దబాయించినా, బెదిరించినా వెనక్కితగ్గబోం’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
రేవంత్ స్కామ్‌లపై బీజేపీ స్పందించాలి
బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా రేవంత్ సర్కారు ఆగడాలను ఎండగడుతున్నామని, స్కామ్‌లను బట్టబయలు చేస్తున్నామని హరీశ్‌రావు వెల్లడించారు. కానీ బీజేపీ మౌనంగా ఉండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆపార్టీ కాంగ్రెస్ సర్కారు కుంభకోణాలపై ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. నిజంగా చిత్తశుద్ధి, ప్రజాధనాన్ని కాపాడాలనే సోయి ఉంటే వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాము స్కామ్‌లను బట్టబయలు చేస్తుంటే, అన్యాయాలపై నిలదీస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి తమపై ఎైంక్వెరీల పేరిట భయపెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ‘నీ ఇష్టం.. మాపై ఎన్ని ఎంక్వైరీలైనా వేసుకో.. ఇది నీ పంచాయితీ.. నా పంచాయితీ కాదు..నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల బతుకు..’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఎన్ని ఇబ్బందులుపెట్టినా, బెదిరింపులకు దిగినా వెనక్కితగ్గబోమని పునరుద్ఘాటించారు. అవసరమైతే ప్రజల తరఫున బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుందని చెప్పారు. ప్రజలు సైతం కాంగ్రెస్ సర్కారు చేస్తున్న దుర్మార్గాలపై స్పందించాలని విజ్ఞప్తిచేశారు.
నాడు ఐదుకే వస్తదన్నరు.. నేడు పది పెడుతున్నరు
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో మార్కెట్లో రూ.5కే యూనిట్ విద్యుత్ లభిస్తుందని చెప్పారని, ఇప్పుడు యూనిట్ విద్యుత్తు కోసం రూ.10కి పైగా వెచ్చిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ఇదంతా కమీషన్ కోసం కాదా? అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2,400 మెగావాట్ల విద్యుత్తు కోసం ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకపోవడం తెలంగాణకు తీరని అన్యాయమని, చారిత్రక ద్రోహమని నాడు విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు భారీ వ్యయంతో కొత్త థర్మల్ కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో 29 జూలై, 2024న చేసిన వ్యాఖ్యల వీడియోను ఈ సందర్భంగా మీడియాకు చూపించారు.
‘ప్రతిపాదిత రామగుండం ప్లాంట్ డీపీఆర్ ప్రకారం యూనిట్‌కు రూ.7.92 ఖర్చు చేయబోతున్నరు. ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగైదు ఏండ్లు పడుతుంది. అదనంగా పెరిగే ఇతర వ్యయాలు కలుపుకుంటే ప్లాంటు నిర్మాణ వ్యయం రూ.10,880 కోట్ల నుంచి రూ.14-15 వేల కోట్లకు పెరుగుతుంది. కరెంట్ యూనిట్ కాస్ట్ రూ.7.92 నుంచి 9,10 రూపాయలకు పెరుగుతుందని అంచనా. నాడు 4 నుంచి 5 కాస్ట్‌తో విద్యుత్తు కొనుగోలు చేయొచ్చు అన్న రేవంత్‌రెడ్డి నేడు రూ.10 ఒక యూనిట్ కోసం ఖర్చు చేస్తనంటున్నడు. ఎవరి ప్రయోజనం కోసం? కమీషన్ల కోసమే కదా? మెగావాట్ కాస్ట్ ఎకువే, పవర్ యూనిట్ కాస్ట్ ఎకువే? ఇది కమీషన్ల కోసం కాదా? దీనికి సమాధానం చెప్పు రేవంత్‌రెడ్డీ’ అని హరీశ్‌రావు నిలదీశారు.
12.23 కోట్లా? 14 కోట్లా? ఏది ఎక్కువ?
‘రామగుండం, పాల్వంచ, మక్తల్‌లో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు పెడతమని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నరు. రామగుండం ప్లాంట్ విషయంలో ఎన్టీపీసీ, జెన్కోకు అవకాశం కల్పిస్తామన్నరు. ఎవరు తక్కువ రేట్‌కు కోట్‌చేస్తే, తక్కువ ధరకు కరెంట్ ఇస్తే వారికే ఇస్తన్నరు. ఇదంతా పెద్ద డ్రామా! దీనిపై ఎన్టీపీసీ, జెన్కోలు రెండు డీపీఆర్‌లు తయారుచేశాయి. ప్లాంట్లు కట్టించి ఇచ్చేందుకు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ సంస్థ కాదు. ఇతరుల కోసం ప్లాంట్లను నిర్మించదు. ఈ ప్లాంట్ కోసం క్యాబినెట్‌కు సమర్పించిన జెన్కో డీపీఆర్ ప్రకారం ఒక మెగావాట్‌కు రూ.14 కోట్లు ఖర్చవుతుందని చెప్పింది.
మొదట రూ.17 కోట్లు చెప్పి.. బద్నాం అవుతామని రూ.14 కోట్లకు తగ్గించారు. ఆ తర్వాత అంచనాలు పెంచే స్కెచ్.. స్కామ్ కూడా దీని వెనుకున్నది. తెలంగాణ కోసమే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ 4వేల మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను కడుతున్నది. 1600 మెగావాట్ల ప్లాంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టింది. ఈ పవర్‌ను తెలంగాణ తీసుకున్నది కూడా. ఇప్పుడు మరో 2,400 మెగావాట్ల ప్లాంట్‌ను ఎన్టీపీసీ కడుతున్నది. ఎన్టీపీసీ ఒక మెగావాట్‌కు రూ.12.23 కోట్లతో డీపీఆర్‌ను రూపొందించింది. జెన్కోది ఎక్కువనా.. ఎన్టీపీసీది ఎక్కువనా? అంటే దీంట్లో ఖుల్లంకుల్లా. ఎన్టీపీసీ ధర తక్కువని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. దీనిపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటామనడం హ్యాస్యాస్పదం. స్కెచ్‌ను అమలుచేసేందుకు ఇదో డ్రామా. అంతా డైవర్షన్ డ్రామా’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
అధికారంలోకి వస్తే రద్దు చేస్తామన్న కోమటిరెడ్డి
నాడు కేసీఆర్ ఎంతో ముందుచూపుతో నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు సంకల్పిస్తే, తాము అధికారంలోకి వస్తే ప్లాంటును రద్దు చేస్తామని నాడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారని హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ, అధికారంలోకి రాగానే పోటీ పడి మరీ ప్రారంభించిండు. ఓసారి ముఖ్యమంత్రి ప్రారంభించిండు, ఓసారి భట్టితో కలిసి ప్రారంభించిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం 95% పూర్తిచేసిన ప్రాజెక్టును తమ గొప్పతనంగా చెప్పకొని, జాతికి అంకితం చేశారు’ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. నాడు ‘నో మోర్ థర్మల్ పవర్‌ప్లాంట్స్’ అనేదే తమ విధానమని చెప్పిన మంత్రి కోమటిరెడ్డి నేడు కొత్తగా మూడు థర్మల్ ప్రాజెక్టులకు క్యాబినెట్లో చర్చిస్తుంటే ఎందుకు మాట్లాడలేదు. కమీషన్ల కోసమా? వాటాలా కోసమా? అని హరీశ్‌రావు నిలదీశారు.
ఎలాంటి అప్పు చేయకుండా రూ.4.12కే యూనిట్ విద్యుత్తు సరఫరా చేస్తామని ఎన్టీపీసీ చెప్తుంటే ఎందుకు వద్దంటున్నారు. ఎన్టీపీసీని తిరసరించడం వెనుక మతలబు ఏమిటి? ఇది స్కామ్ కాకపోతే మరేమిటి?
-హరీశ్‌రావు
నిన్న రూ.5 లక్షల ల్యాండ్ స్కాంను బట్టబయలు చేశాం. నేడు రూ.50 వేల కోట్ల విలువైన పవర్స్కాంను బయటపెడుతున్నాం. త్వరలోనే మరో మూడు స్కామ్‌లు బయటపెడతాం. హైదరాబాద్ అండర్‌గ్రౌండ్ కేబుల్, పంపుడ్, బ్యాటరీ స్టోరేజీ కుంభకోణాలను ఆధారసహితంగా ప్రజల ముందుంచుతాం. ఇప్పటికే 90% వివరాలు సేకరించాం, మరో 10% సేకరించి మీడియా ముఖంగా బహిర్గతం చేస్తాం.
-హరీశ్‌రావు
పింఛన్లు, రిటైర్మెమెంట్ బెనిఫిట్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు డబ్బులు లేవంటున్న రేవంత్‌రెడ్డి.. థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.50 వేల కోట్లు ఎక్కడినుంచి తెస్తరు? రూ.50 వేల కోట్లలో 80% అప్పు, 20% రాష్ట్రవాటాగా చెల్లించాల్సి ఉంటుంది. రూ.40 వేల కోట్ల అప్పులు, పది వేల కోట్ల పెట్టుబడి ఎకడ తెస్తవు?
-హరీశ్‌రావు
సోలార్ పవర్ప్లాంట్లను సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు అప్పగించి వారిని కోటీశ్వరులను చేస్తమని చెప్పి శఠగోపం పెట్టిన ఘనత రేవంత్ సర్కారుదే. ఒక్కో గ్రూపునకు నాలుగెకరాల చొప్పున కేటాయిస్తామని చెప్పి నట్టేట ముంచారు. వారికి ఎన్ని ప్లాంట్లు కేటాయించారో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలి.
-హరీశ్‌రావు