దగాపడిన బతుకుల్లో ఆశలు చిగురించాయి.. చీకట్లు కమ్ముకున్న జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయి.. దళితుల దశాదిశా మార్చేందుకు అభినవ అంబేద్కరుడిలా..దళిత బాంధవుడిలా ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ‘దళితబంధు’తో ‘ఆత్మగౌరవ’ బాటలు పడుతున్నాయి.. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్ నియోజకవర్గంలో పథకం అమలుకు తాజాగా రూ.500 కోట్ల నిధులు విడుదల చేయడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.. దళితవాడల్లో సంబురాలు అంబరాన్నంటాయి..
దళిత బంధు పథకం అమలు కోసం ప్రభుత్వం విడుదల చేసిన 500 కోట్లు మధ్యాహ్నం జిల్లా ఖాతాలో జమైనట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ప్రభుత్వం చెప్పినట్లుగా కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇస్తే.. ప్రస్తుతం వచ్చిన నిధులతో 5వేల కుటుంబాలకు తొలి విడుత లబ్ధి చేకూరుతుందని చెప్పారు. సోమవారం కలెక్టర్ ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత కుటుంబాలు 20,929 ఉన్నాయని చెప్పారు. పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలు, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు, ఇప్పటి వరకు జరిగిన సర్వే వివరాలన్నింటినీ ఆధారంగా చేసుకొని కుటుంబాలకు లబ్ధి కల్పిస్తామని చెప్పారు. దళిత బంధు పథకాన్ని ఈ నెల 16న హుజూరాబాద్‌లో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. పథకాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయడానికి ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. లబ్ధి పొందిన కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి కావాల్సిన ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఇప్పటికే మండల రిసోర్సు పర్సన్లు, సంబంధిత అధికారులతో పలుసార్లు మీటింగ్‌లు నిర్వహించినట్లు తెలిపారు.