హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రామగుండంలో వైద్య కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలని సింగరేణి కాలరీస్ నిర్ణయించింది. ఇప్పటికే సింగరేణి డైరెక్టర్ల బోర్డు సమావేశం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఈ ప్రతిపాదనకు సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి శతవార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కూడా ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో రామగుండంలో వైద్య కళాశాలతోపాటు సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రామగుండంలో వైద్యకళాశాల, సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటుచేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు సింగరేణి కార్మికులు, ఉద్యోగుల తరఫున సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే 100వ ఏజీఎం సమావేశం నిర్వహించిన సంస్థగా సింగరేణి రికార్డు నెలకొల్పింది. ఈ సమావేశానికి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్, పీ అండ్ పీ) బలరామ్, డైరక్టర్ (ఈఅండ్ ఎం) సత్యనారాయణరావు, రాష్ట్రపతి తరపున ప్రతినిధిగా బొగ్గుశాఖ డైరెక్టర్ పీఎస్ఎల్ స్వామి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తరపున ఇంధనశాఖ సహాయ కార్యదర్శి ఎల్లయ్య, షేర్‌హోల్డర్ డాక్టర్ పీవీ రమణ, కంపెనీ కార్యదర్శి సునీతాదేవి తదితరులు పాల్గొన్నారు.