హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): దేశంలోని ట్రక్, భారీ రవాణా వాహన డ్రైవర్లలో 50 శాతం మందికి దృష్టి లోప సమస్య ఉన్నది. ఈ విషయం సైట్ సేవర్స్ ఇండియా అనే ఎన్జీవో సహకారంతో నోయిడాలోని ఐ కేర్ ఐ హాస్పిటల్ చేసిన సర్వేలో వెల్లడైంది. రాహి(ఆర్ఏఏహెచ్ఐ)- నేషనల్ ట్రకర్స్ ఐ హెల్త్ ప్రోగ్రామ్ పేరిట దేశవ్యాప్తంగా 34 వేల మంది ట్రక్ డ్రైవర్ల కండ్లను పరీక్షించింది. అందుకు సంబంధించిన నివేదికను ఇటీవలే వెల్లడించింది.
ఆ రిపోర్టు ప్రకారం 50 శాతం డ్రైవర్లు దృష్టి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. 38 శాతం దగ్గరి దృష్టి, 8 శాతం మంది దూర దృష్టి, 4 శాతం మంది రెండు దృష్టి సమస్యలతో బాధపడుతున్నారు. అయినా ట్రక్ డ్రైవర్లు ఎవరూ అద్దాలు పెట్టుకోవడం లేదని చెప్పడం విశేషం. ఇక 36 నుంచి 50 ఏండ్ల వయసులోని డ్రైవర్లు ఎకువ మంది దగ్గరి దృష్టి సమస్యలు, 18 నుంచి 35 ఏండ్ల వయసున్న డ్రైవర్లు దూరం దృష్టి లోపాలతో బాధపడుతున్నారని రిపోర్టులో పేర్కొన్నది.
45 శాతం ప్రమాదాలు డ్రైవర్ల దృష్టిలోపంతోనే జరుగుతున్నాయని అధ్యయనంలో తేలింది. నిర్ణీత వేళలు లేకపోవడం, ఎక్కువ మంది గ్రామీణులు కావడం, అవగాహన రాహిత్యం, ఆర్థిక స్థోమత లేకపోవడం తదితర కారణాలతో కంటి పరీక్షలు చేయించుకోలేని ట్రక్ డ్రైవర్లే అధికమని నివేదిక వివరించింది. చాలా మంది ట్రక్ డ్రైవర్లు ఎకువ పని గంటలు, సరికాని పరిశుభ్రత కారణంగా కండ్లు పొడిబారి, దీర్ఘకాలిక అలర్జీ బారిన పడుతున్నారని తెలిపింది. 60 ఏండ్లు పైబడిన చాలా మంది డ్రైవర్లు కంటిశుక్లం సమస్యతో బాధపడుతున్నారని పేర్కొన్నది. ట్రక్ డ్రైవర్లందరికీ సాధారణ కంటి పరీక్ష తప్పనిసరి అని, తద్వారా వారితోపాటు రోడ్లపై ఇతరులు సురక్షితంగా ఉంటారని ఐ కేర్ ఐ హాస్పిటల్ సీఈవో డాక్టర్ సౌరభ్ దరి ఆ నివేదికలో సూచించారు.
సచివాలయంలో కంటివెలుగు
తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది కోసం ప్రత్యేకంగా కంటివెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఈ నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 10 రోజులపాటు కొనసాగే ఈ శిబిరంలో రోజుకు వంద మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారని, సచివాలయ ఉద్యోగులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సీఎస్ కోరారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.