హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఏడాదిన్నర కాలంగా హడలెత్తిస్తున్న హైడ్రా హైదరాబాద్ నగరవాసుల్లో సృష్టించిన భయాందోళన అంతా ఇంతా కాదు. ఇదే అదునుగా కొంతమంది హైడ్రా పేరు చెప్పి అమాయకులను దోచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. హయత్‌నగర్ పరిధిలో ముగ్గురు కేటుగాళ్లు హైడ్రా అధికారులు తమకు తెలుసునని చెప్పి ఓ మహిళను మోసగించి రూ.50 లక్షలు కొట్టేశారు. దీనిపై హైడ్రా ఏసీపీ తిరుమల్ పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం.. హైదరాబాద్ తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖాల్ గ్రామంలో వర్టెక్స్ అనే కంపెనీ తమ భూమిలో రోడ్డు వేసిందని ఆరోపిస్తూ చైతన్యరెడ్డి అనే మహిళ జూన్‌లో హైడ్రాను ఆశ్రయించారు. దీనిపై హైడ్రా ఓవైపు దర్యాప్తు జరుపుతుండగానే.. ఆ రోడ్డు తొలగింపు విషయమై ఆమె తన బంధువు ప్రవీణ్‌ను సంప్రదించారు.
తనకు ఒక న్యాయవాది సుంకర నరేశ్ తెలుసునని, అతడు ఈ సమస్యను పరిష్కరించగలడని, అతడు ఓ డిజిటల్ మీడియాకు లీగల్ అడ్వైజర్‌గా ఉన్నాడని ప్రవీణ్ చెప్పాడు. దీంతో ఆమె సుంకర నరేశ్‌ను కలుసుకున్నారు. సుంకర నరేశ్ తనకో స్నేహితుడు చందుశ్రీనివాస్ ఉన్నాడని, అతడికి హైడ్రా అధికారులు తెలుసునని చెప్పి, అతనితో ఆమెను ఫోన్లో మాట్లాడించాడు. కొద్దిరోజుల తరువాత ప్రవీణ్, సుంకర నరేశ్, చందుశ్రీనివాస్ కలిసి ఆమెను బురిడీ కొట్టించే ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించారు. హైడ్రా అధికారులు డబ్బులు ఇస్తే పనిచేస్తామని చెప్పారని, అందుకోసం రూ.50 లక్షలు కావాలని అన్నారు. దీంతో ఆమె మాదాపూర్‌లోని తన ఆఫీసులో తొలుత రూ.20లక్షలు ఇచ్చింది.
ఆ తర్వాత జూన్ చివరివారంలో మళ్లీ నరేశ్ మిగిలిన డబ్బులు అడుగగా.. ఆ రోజు అమావాస్య కావడంతో మరుసటి రోజు ఇస్తానని చెప్పింది. ఆ తరువాత రోజు వారు పంపిన మనిషికి ఆమెకు రూ.30 లక్షలు ఇచ్చింది. ఈ ఫిర్యాదు మేరకు సుంకరి నరేశ్‌ను బార్‌కౌన్సిల్ నుంచి తొలగించినట్టు హైడ్రా అధికారులు తెలిపారు. ప్రవీణ్, సుంకరి నరేశ్, చందుశ్రీనివాస్పై 318(4), 318(2) రెడ్‌విత్ 3(5) బీఎన్ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. హైడ్రా పేరుతో మోసాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ సందర్భంగా తెలిపారు.