హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువను 50 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రతిపాదనలు అందినట్టు తెలుస్తున్నది. కనిష్ఠంగా 20%, గరిష్ఠంగా 50% పెంచాలని ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నట్టు సమాచారం. ఈ పెంపు బహిరంగ మార్కెట్ విలువలో సగానికి మించకూడదని సూచించినట్టు తెలుస్తున్నది. మారెట్ విలువ పెంపుపై స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఈ నెల 18 నుంచి క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 143 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, సర్వే నంబర్లవారీగా వ్యవసాయ భూములు, స్థలాలు, వెంచర్లు, అపార్ట్మెంట్లకు సంబంధించిన అధ్యయనాన్ని పూర్తి చేసింది.
ప్రస్తుత ధరలు, బహిరంగ మార్కెట్లోని విలువలను కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు అధ్యయనం చేసి, ఏ మేరకు పెంచవచ్చో ప్రతిపాదనలు రూపొందించాయి. సంబంధిత ప్రాథమిక అంచనాలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్- ఇన్స్పెక్టర్ జనరల్ (సీఐజీ) ప్రధాన కార్యాలయానికి అందజేశాయి. ఈ నివేదికపై మంగళవారం సీఐజీ ఆధ్వర్యంలో సమీక్ష జరిపి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నది. కానీ, ప్రభుత్వం తాజా బదిలీల్లో జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను సీఐజీగా నియమించింది. ఈ నేపథ్యంలో సమీక్ష వాయిదా పడినట్టు తెలుస్తున్నది. బాధ్యతలు తీసుకున్న తర్వాత సమీక్ష జరుపనున్నట్టు సమాచారం.
పెంపుపై మల్లగుల్లాలు
భూ విలువల సవరణపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తున్నది. కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతున్నట్టు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. వాస్తవానికి భూముల ధరలు పెంచుతుందన్న ప్రకటన వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు జోరందుకుంటాయి. డబ్బు ఆదా చేసుకునేందుకు ముందస్తుగా క్రయవిక్రయాలు జరుపుతుంటారు. కానీ, రాష్ట్రంలో కొన్నాళ్ల నుంచి రిజిస్ట్రేషన్లు క్రమంగా తగ్గుతున్నట్టు తెలిసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఓ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజూ కనీసం 20-25 రిజిస్ట్రేషన్లు చోట మంగళవారం సగం కూడా జరగలేదట. ఈ నేపథ్యంలో భూముల ధరల పెంపుపై ప్రభుత్వం పునరాలోచన జరుపుతున్నట్టు చెప్తున్నారు. ఆగస్టు 1 నుంచి కొత్త ధరలను అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. దసరా వరకు వాయిదా పడవచ్చని వినికిడి.