హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : చెప్పిన మాట గుర్తుకు లేదో.. ఇచ్చిన హామీ ఎగ్గొడదామనే ఆలోచనోగానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాహనదారులను, ముఖ్యంగా ఆటోడ్రైవర్లను ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఏమార్చారు. పీసీసీ చీఫ్‌గా అడ్డగోలు హామీలు ఇచ్చి ఓట్ల కోసం కల్పిత హామీలు మ్యానిఫెస్టోలో పెట్టి నమ్మించి మరీ వాహనదారుల గొంతుకోసేందుకు ప్రయత్నించారు. 2023 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటోడ్రైవర్లకు 50 శాతం రాయితీ కల్పించి మరీ వన్‌టైమ్ సెటిల్మెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు మోసగించే ప్రయత్నాలకు తెరతీశారు. ట్రాఫిక్ చలాన్లను నేరుగా బ్యాంకులకు లింక్ చేయాలనే ఆలోచన చేయడం సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద్వనీతికి నిదర్శనమని ట్రేడ్ యూనియన్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం వ్యాఖ్యలతో కలవరం
తెలంగాణలో ఎక్కడైనా వాహనంపై ట్రాఫిక్ చలానా రాస్తే అది నేరుగా బ్యాంకు ఖాతా నుంచే కోత అయ్యేలా చర్యలు తీసుకోవాలని, సాంకేతికతను ఉపయోగిస్తూ బ్యాంకులను సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాహనదారులను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో కాలం వెల్లదీస్తున్న తమకు ముఖ్యమంత్రి నిర్ణయం అమల్లోకి వస్తే పెనుభారమవుతుందని సామాన్య జనం వాపోతున్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వాహనదారులు, ఆటోడ్రైవర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం రాయితీ ప్రకటించి, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అన్నింటినీ తుంగలో తొక్కుతూ వాహనదారులను ఇబ్బందిపెట్టేలా మాట్లాడటం సరికాదని పేర్కొంటున్నారు.
అధ్వానంగా రోడ్లు, సిగ్నళ్లు
తెలంగాణలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. సిగ్నల్స్, రోడ్డు క్రాసింగ్ దగ్గర సూచన బోర్డులు లేవు. ప్రతి 50 కి.మీ.కూ ఒకచోట రవాణా కార్మికులకు విశ్రాంతి గదుల ఏర్పాటు లేదు. యూటర్న్ దగ్గర నియంత్రణ లేదు, ట్రాఫిక్ నియంత్రణకు తగిన సిబ్బంది నియామకమూ జరుగలేదు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల నిర్మాణం ఉన్నది. ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బంది ఆఫీస్ రూమ్‌లో కూర్చొని సీసీ కెమెరాల ద్వారా ఇష్టం వచ్చినట్టుగా ఫొటోలు తీస్తూ ప్రజలపై చలాన్లు వేస్తుండగా, చాలామంది సిబ్బంది నియంత్రణ వదిలేసి ఫొటోలు తీసుకోవడంలోనే బిజీగా, టార్గెట్లు చేరుకునేలా వాహనదారులను జలగల్లా పీడిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగడం, ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగడం ఎక్కువ అవుతున్నదని ఎన్జీవోల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతులు కల్పించకుండా ప్రమాదాలు అరికట్టడానికి ఫైన్లు వేయడం, డ్రైవర్లను శిక్షించడమే మార్గంగా సీఎం చెప్పడం అశాస్త్రీయమని ట్రేడ్ యూనియన్ల నేతలు విరుచుకుపడుతున్నారు.
నిరసనలకు ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ పిలుపు
సీఎం రేవంత్‌రెడ్డి రవాణారంగంపై చేసిన వ్యాఖ్యలు అనుచితమని తెలంగాణ రోడ్డు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వరర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్-సీఐటీయూ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య బుధవారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఆటో, కారు, లారీ ఇతర వాహనాలపైన బీఆర్ఎస్ సర్కార్ అడ్డగోలుగా దొడ్డిదారిన దారిదోపిడీ చేసిందని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా రవాణారంగ కార్మికులు, ప్రజలు ఇబ్బందులుపడేలా మాట్లాడటం హేయమన్నారు. వాహనదారులు తప్పు చేసినట్టు ఏకపక్ష నిర్ధారణకు వచ్చి డబ్బులు లాకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమాలకు ట్రాన్స్‌పోర్టు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వీరయ్య, ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. మ్యానిఫెస్టోలో ప్రతి ఆటో కార్మికుడికీ ఏడాదికి రూ.12 వేల జీవనభృతి చెల్లిస్తానని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పి ఇప్పటికీ అమలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
బ్యాంక్ అకౌంట్ లింక్ ప్రజావ్యతిరేకం : బీఆర్టీయూ
వాహన రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ అకౌంట్‌ను తప్పనిసరిగా జత చేయాలన్న వ్యాఖ్యలను భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (టీఆర్టీయూ) తీవ్రంగా ఖండించింది. నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమైనదని సంఘం ఉపాధ్యక్షులు అత్తినమోని నాగేశ్‌కుమార్ పేర్కొన్నారు. బ్యాంక్ ఖాతాలపై ప్రభుత్వం నేరుగా పర్యవేక్షణ పెంచే ప్రమాదకారి ఆలోచనగా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చాలీచాలని ఆదాయంతో జీవితాలను గడుపుతున్న టాక్సీ, ఆటోడ్రైవర్లు, గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వరర్స్ పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక వ్యాఖ్యలను సీఎం వెంటనే వెనకి తీసుకోకపోతే బీఆర్టీయూ ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తుందని హెచ్చరించారు.
బీఆర్టీయూ ఆధ్వర్యంలో నిరసన
ట్రాఫిక్ నిబంధనల పేరుతో ప్రభుత్వం ప్రజల డబ్బులు నిలువు దోపిడీ చేస్తున్నదని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వేము మారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపగా, సికింద్రాబాద్‌లో జరిగిన ధర్నాలో మారయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్రాఫిక్ నిబంధనల విషయమై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, చలానా నేరుగా కట్ చేసుకోవాలని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆ ఆలోచనకు కార్యరూపం ఇస్తే అన్ని కార్మిక సంఘాలు, యానియన్లు, ప్రజల మద్దతు కూడగట్టుకొని పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇది యూటర్న్ ప్రభుత్వం
ప్రతి వాహనదారుడూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. కానీ చలాన్ల కోసం వాహనదారుడి ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా నగదు బదిలీ అయ్యేలా చర్యలు తీసుకోవాలనటం అనాలోచిత చర్య. దీన్ని అమలు చేసే కంటే ముందు రోడ్లను అధ్వానంగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ బ్యాంకు ఖాతాలు లింక్ చేయాలి. ప్రధాని నరేంద్రమోదీ జన్‌ధన్ ఖాతాలు ఓపెన్ చేసి ప్రజలకు డబ్బులను జమ చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం ప్రజల ఖాతాల నుంచి నగదును లూటీ చేస్తున్నది. పెనాల్టీలు వసూలు చేయడంలో చూపించే వేగం ఇచ్చిన హామీలు అమలులో చూపాలి.
-ఎక్స్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్
పిల్లలు తెలిసోతెల్వకో తాగితే డ్రంక్ అండ్ డ్రైవ్ అని నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని, వాన్ని పోలీస్‌స్టేషన్‌లో పెట్టి, వాని వీపు పగులగొట్టి, రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. చట్టం నీకోటి.., పేదోళ్లకు మరోతీరుగా ఉంటుందా..? వాహనదారుల బాధలు తీరుస్తాం. ఆటోడ్రైవర్లకు 50 శాతం రాయితీ కల్పించి మరీ వన్‌టైమ్ సెటిల్మెంట్ చేస్తాం.
– 2023 ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
ఏ వాహనంపైనైనా చలానా వేస్తే పైసా కూడా తగ్గించకండి. ఓనర్ బ్యాంకు అకౌంట్స్‌ని డైరెక్ట్‌గా డిపార్ట్మెంట్కు సింక్రనైజ్ చేసుకుంటే ఎప్పుడు చలానా పడినా ఆటోమేటిక్‌గా డిడక్ట్ అయ్యేలా చూడండి. బండి రిజిస్ట్రేషన్‌కు వచ్చినప్పుడే ఓనర్ ఖాతాను తీసుకోండి. ఏ బండైతే స్పీడింగ్.. సిగ్నల్ జంప్ చేస్తదో.. అప్పుడే యజమాని ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యేలా టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను సమన్వయం చేసుకోండి.
– సోమవారం (జనవరి 12న) ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి