హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం గత మూడేండ్లలో బర్రెలు, మేకలు, గొర్రెల పెంపకందారులకు దాదాపు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో బర్రెల షెడ్ల నిర్మాణం కోసం రూ.40.87 కోట్లు మంజూరు చేయగా, మేకలు, గొర్రెల షెడ్ల కోసం రూ.8.98 కోట్లు మంజూరయ్యాయి. మనుషులు తలదాచుకోవడానికి ఇల్లు ఎంత అవసరమో, పశువులు, గొర్రెలు, మేకలు ఆరోగ్యంగా ఉండటానికి షెడ్లు లేదా కొట్టాలు అంతే ముఖ్యం. వీటిని నిర్మించుకొనే ఆర్థిక స్థోమతలేని చాలామంది పశువులు, గొర్రెలు, మేకల పెంపకందారులు వాటిని చెట్ల కింద, ఆరుబయట కట్టేస్తున్నారు. దీంతో వాన, చలి, ఎండలకు తట్టుకోలేక రోగాలబారిన పడుతున్నాయి. దూడలు, మేక, గొర్రె పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. వానకాలంలో మేత కూడా తడిసి, వృథా అవుతున్నది. ఈ దుస్థితిని అధిగమించేందుకు పశువులు, మేకలు, గొర్రెల పెంపకందారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తున్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు ఉన్న రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులకు దశలవారీగా షెడ్లను మంజూరు చేస్తున్నది. ప్రతి సంవత్సరం బర్రెలకు ఐదు వేలకు పైగా షెడ్లు, గొర్రెలు, మేకలకు వేయి షెడ్లను మంజూరు చేస్తున్నది. ఆయా యూనిట్లను గ్రామసభలో మంజూరు చేస్తారు. అనంతరం షెడ్లను నిర్మించుకోవాల్సి ఉంటుంది.
గతంలో పశువుల కొట్టం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. బర్రెలు వర్షంలో తడిసేవి. కొన్నిసార్లు దూడలు చనిపోయేవి. బాధ అనిపించేది. పాలు కూడా తక్కువగా ఇచ్చేవి. షెడ్డు కట్టినంక పశువులకు ఇబ్బంది లేకుండా పోయింది. పాలు కూడా ఎక్కువ ఇస్తున్నాయి. ప్రభుత్వమే డబ్బులు మొత్తం ఇచ్చింది.
తోట కృష్ణవేణి, బేతుపల్లి గ్రామం,
ప్రభుత్వ సాయం అక్కరకొచ్చింది
వర్షాల్లో గొర్రెలు తడిసి వాటికి రోగాలు వచ్చేవి. కొన్ని చనిపోయేవి. షెడ్డు కట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇబ్బంది లేదు. షెడ్డుకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. మేము మంచిగా కట్టుకున్నం. ప్రభుత్వ సాయం మంచిగా అక్కరకు వచ్చింది. నాకు 50 గొర్రెలు ఉన్నాయి. గతంలోనే పశువుల కొట్టం కట్టుకున్నా. వ్యవసాయం చేసుకుంటా. కూరగాయలు పండిస్తా. పశువులు, గొర్రెలు ఇలా అన్ని రకాలను సాదుకుంటా.
బండారి తిరుపతయ్య, గర్విపల్లి గ్రామం, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా