హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఐదువేల ఏండ్ల క్రితం ఆదిమానవులు నివసించారని చెప్పేందుకు సాక్ష్యాలు లభించాయి. నగరంలో బీఎన్నార్ హిల్స్‌లోని పడగరాయి పైకప్పుపై పురాతన బొమ్మల లిపిని గుర్తించినట్టు చరిత్రకారుడు డాక్టర్ ద్యావనవల్లి సత్యనారాయణ తెలిపారు. ఇక్కడ గుర్తించిన గొలుసుకట్టు రాత ఎరుపు రంగులో ఉన్నదని, మహబూబ్‌నగర్ సమీపంలోని మన్నెంకొండ, వర్గల్ సరస్వతీ ఆలయ పరిసరాల్లోని పడగరాళ్ల పైకప్పులపైనా ఇలాంటి లిపి కనిపించిందని పేర్కొన్నారు.
అక్కడి అక్షరాలు చదవడానికి వీల్లే ని స్థితిలో ఉండగా.. బీఎన్నార్ హిల్స్ పడగరాయిపై అక్షరాలు చదివే వీలుందని తెలిపారు. బీఎన్నార్ హిల్స్‌లో తాజాగా గుర్తించిన లిపి సింధు నదీలోయ నాగరికత నాటి అక్షరాలను పోలి ఉన్నట్టు చెప్పారు. ఇందులోని అక్షరాలు ఇంగ్లిష్ అక్షరాలైన ‘డీ’, ‘ఈ’లను తిప్పి రాసినట్టుగా ఉన్నట్టు పేర్కొన్నారు. వీటితోపాటు మరో మూడు నాలుగు అక్షరాలను కూడా గుర్తించినట్టు తెలిపారు. 5వేల ఏండ్ల క్రితం ఆదిమానవులు ఇక్కడ ఆయుధాలు, పనిముట్లను తయారు చేసుకున్న సమయంలో ఏర్పడిన గుర్తులు అని చెప్పారు. అలాగే, ఓ గుండుకున్న వృత్తంలో శూలం బొమ్మ ఉన్నదని, ఇది సుమారు మూడు వేల ఏండ్ల నాటి బృహత్ శిలాయుగం నాటిదని తెలిపారు.
18వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి బంజారా గురు వు సంత్ సేవాలాల్ మహారాజ్ వచ్చారని చెబుతుంటారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఆధారం ఒకటి బీఎన్నార్ హిల్స్‌లో లభించింది. ఆ రాతిపై ‘జగ్టంటి వెంకటేశాయ’ అనే అక్షరాలు తొలిచి ఉన్నా యి. మొదటి రెండు అక్షరాలు అస్పష్టంగా ఉండడంతో అవి ‘బోర్జంటి వెంకటేశాయ’ కూడా అయ్యే అవకాశం ఉందని సత్యనారాయణ పేర్కొన్నారు.
బీఎన్ఆర్ హిల్స్‌లోని తాబేలు గుండులో కొత్త రాతి యుగానికి చెందిన గొడ్డళ్లను కనుగొన్నట్టు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ ప్రొఫెసర్ రామోజు హరగోపాల్ తెలిపారు. నగరంలో ఇలాంటివి లభించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. గతంలో 2 వేల ఏండ్లనాటి రాతి పనిముట్లు దొరికాయని, కానీ 4 నుంచి 2 వేల ఏండ్ల మధ్య కాలానికి చెందిన వస్తువులు లభించడం ఇదే తొలిసారని వివరించారు. నీటి వనరులు పుష్కలంగా ఉండే దుర్గం చెరువు, మల్కం చెరువు పరిసరాల్లో ఈ రాతి గుట్టలు ఉండడం వల్ల సహజంగానే ఆదిమానవులు ఇక్కడ సంచరించి ఉంటారని శివనాగిరెడ్డి తెలిపారు.