హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ చార్జీలు మళ్లీ పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలు పెరుగుతాయి. ఈసారి లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెంపు వాయిదా పడింది. జూన్ 1న ఆఖరి విడత పోలింగ్ ముగియనున్నది. అదేరోజు అర్ధరాత్రి నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. మొత్తం ఐదు శాతం మేర టోల్చార్జీలను పెంచనున్నట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు.
పెరగనున్న టోల్ చార్జీల ప్రకారం యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు రెండు వైపులా ప్రయాణానికి రూ.5, చిన్న లారీపై రూ.10 చొప్పున పెరిగాయి. వాణిజ్య, భారీ గూడ్స్ లారీలకు రూ.15 చొప్పున చార్జీలు పెరుగుతాయి.
తెలుగు రాష్ర్టాల్లో ఉన్న హైదరాబాద్-విజయవాడ (65), హైదరాబాద్-వరంగల్ (163) జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా పరిధిలోని చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని చిల్లకల్లు (నందిగామ), వరంగల్ హైవేపై బీబీనగర్ మండలం గూడురు టోల్ ప్లాజాలు ఉన్నాయి.