Vruksharchana | హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఇప్పటికే అద్భుత ఫలితాలతో అప్రతిహతంగా కొనసాగుతున్నది. 2018 జూలై 27న ‘హరా హైతో భరా హై’ అనే నినాదంతో ప్రారంభమైన ఈ హరిత యజ్ఞంలో దేశవ్యాప్తంగా అనేక మంది సెలబ్రిటీలు, పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటాలని ప్రజలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. నేడు తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో ‘వృక్షార్చన’కు శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి సెల్ఫీ దిగి 9177916838 నంబర్‌కు వాట్సాప్ చేయాలని సంస్థ కోరింది. ఇందులో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గాలు, పట్టణాల్లో వృక్షార్చనపై క్షేత్ర స్థాయిలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అవగాహన కల్పించారు. పోస్టర్లు ఆవిష్కరించి వృక్షార్చనపై విస్తృత ప్రచారం కల్పించారు.
హరిత తెలంగాణ సాధనే లక్ష్యంగా వృక్షార్చన
రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఆధ్వర్యంలో చేపట్టిన వృక్షార్చనకు భారీ స్పందన వచ్చింది. నేడు కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గ్రామస్థాయి నుంచి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. హరితహారం కార్యక్రమంతో కేసీఆర్ గ్రామాలు, పట్టణాలను పచ్చతోరణాల్లా మార్చగా.. అదే సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా నేడు 5 లక్షల మొక్కలు నాటేందుకు రంగం సిద్ధమైంది. కేసీఆర్ పుట్టిన రోజున చేపట్టే ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు.