Electrocuted | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు షాక్ మరణాల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తున్నది. కరెంటు తీగలు యమపాశాలై ఏటా వందలాది మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఈ పరిస్థితులు బాధిత కుటంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఇంటి పెద్ద మరణంతో కుటుంబాల్లో ఆర్థిక కల్లోలం వెంటాడుతున్నది. ఈ దశలో విద్యుత్తు షాక్తో మరణించిన వారి కుటుంబాలకు సంబంధిత విద్యుత్తు సంస్థలు నష్టరిహారాన్ని చెల్లిస్తాయి. వ్యక్తులు మరణిస్తే వయేభేదం లేకుండా రూ.5 లక్షలు పరిహారంగా చెల్తిస్తారు. పశువుల మరణాలకు విద్యుత్తు సంస్థలు రూ.40 వేలు చెల్లిస్తుండగా, జీవాల మరణాలకు రూ.7 వేల చొప్పున చెల్లిస్తున్నాయి.
2014కు ముందు వ్యక్తుల మరణాలకు పరిహారం కేవలం రూ.ఒక లక్ష మాత్రమే ఉండేది. చిన్న పిల్లలు మరణిస్తే రూ.50 వేలు, పశువులకు రూ.3 వేలు మాత్రమే ఇచ్చేవారు. మేకలు, గొర్రెలకు 2014కు ముందు ఎలాంటి నష్టపరిహారాన్ని అందించేవారే కాదు. బీఆర్ఎస్ సర్కారు చొరవతో ఈ నష్టపరిహారాన్ని పెద్ద మొత్తంలో పెంచడం విశేషం. చిన్న పిల్లలు, పెద్దలన్న తేడాల్లేకుండా వ్యక్తులు మరణిస్తే రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియాగా ఇస్తున్నారు. సంఘటన జరిగిన నెల రోజుల్లోపు అన్నిరకాల డాక్యుమెంట్లు జతచేసి దరఖాస్తు సమర్పించాలి. తొలుత సంబంధిత సంస్థ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ప్రాథమిక విచారణ జరుపుతారు. ఆ తర్వాత డివిజినల్ ఇంజినీర్ (డీఈ) సమగ్ర విచారణ జరిపి పైఅధికారులకు నివేదికను సమర్పిస్తారు. అనంతరం నష్టపరిహారాన్ని సంబంధిత డీఈ కార్యాలయం నుంచే పొందవచ్చు.
ప్రాథమిక విచారణ నివేదిక, సమగ్ర విచారణ నివేదిక, పోలీస్ ఎఫ్ఐఆర్, పంచనామా నివేదిక, డెత్ సర్టిఫికెట్, తాసిల్దార్ జారీచేసిన చట్టపరమైన వారసుల ధ్రువీకరణ పత్రం, సంఘటన ఫొటో, సంఘటన లొకేషన్ వివరాలను దరఖాస్తుతో సహా సమర్పించాలి.
రాష్ట్రంలో విద్యుత్తు షాక్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన ఏడేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 4,420 మంది విద్యుత్తు షాక్తో చనిపోయారు. అంటే ఏటా 700 మంది చొప్పున ప్రాణాలు కోల్పోతుండగా, రోజుకు ఇద్దరి ప్రాణాలను కరెంట్ కబలిస్తున్నది. ఈ ఏడాది మార్చిలో విద్యుత్తు తీగలు తగిలి ఏకంగా ఒకే గ్రామంలో ముగ్గురు మరణించారు. మరోచోట భార్యభర్తలు చనిపోయారు. 2024 ఆగస్టు వరకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో 86, ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో 132 చొప్పున మృత్యువాత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలోనే ఏటా అత్యధిక విద్యుత్తు షాక్ మరణాలు నమోదవుతున్నాయి.