ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన కారు
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
అందోల్/ చౌటకూర్/కొల్చారం, ఆగస్టు 6: కడుపు నొప్పితో బాధపడుతున్న కొడుకును దవాఖాన తీసుకెళ్లి వస్తుండగా కారు లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ వద్ద శుక్రవారం ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటకు చెందిన పుర్ర అంబాదాస్ (33), పద్మ (25) భార్యాభర్తలు. వీరి చిన్న కొడుకు వివేక్ (6) రెండు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో రంగంపేట్కు చెందిన చర్చి పాస్టర్ లూకా (44), అతని భార్య దీవెన (41)తో కలిసి కారులో సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖాన వెళ్లి పరీక్షలు చేయించారు. తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో చౌటకూర్ వద్ద ముందువెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నడుపుతున్న ఫాస్టర్ లూకా, అతడి భార్య దీవెన, అంబాదాస్, పద్మ, వివేక్ అక్కడికక్కడే మృతిచెందారు. రోడ్డు ప్రమాదంపై అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహూటిన ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు, స్థానికులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పుల్కల్ ఎస్సై నాగలక్ష్మి తెలిపారు.