జగిత్యాల కలెక్టరేట్, ఆగస్టు 10: నిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకున్న ఓ కంపెనీ.. గల్ఫ్ దేశాల్లో కొలువుల ఆశ చూపి.. రూ.5 కోట్ల మేర దండుకొని నిండా ముంచింది. యూరప్, థాయిలాండ్, గల్ఫ్ దేశాల్లో కొలువులు చేసేందుకు వీసాలిప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేసి.. దాదాపు 200 మందికి రూ.5 కోట్లు టోకరా వేసి బోర్డుతిప్పేసింది. ఈ ఘటన గురువారం జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. రాచకొండ మహేశ్, వాసు జిల్లా కేంద్రంలోని ధర్మపురి రోడ్డులో విఘ్నేశ్వర కమ్యూనికేషన్స్ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీని స్థాపించారు. 200 మంది దగ్గర డబ్బులు, పాస్‌పోర్టులు తీసుకున్న మహేశ్.. బాధితులకు నకిలీ వీసాలు, టికెట్లు ఇచ్చి పరారయ్యాడు. దీంతో బాధితులు రెండు రోజుల క్రితం జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.