హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత అక్టోబర్ నెలలో సాధారణం కన్నా 49 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 817 మిల్లీమీటర్లు కాగా, 1217 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 72 శాతం, నారాయణపేట్లో 71 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, ఖమ్మంలో అతితక్కువగా ఎనిమిది శాతం, సూర్యాపేటలో 17 శాతం, నల్లగొండలో 23 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
భూగర్భజలాల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, జగిత్యాలలో సాధారణ వర్షపాతం 946 మిల్లీమీటర్లకుగాను 1623 మిల్లీమీటర్లు, అలాగే నారాయణపేట్లో 506 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 863 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి, కరీంనగర్లో 69 శాతం, నిజామాబాద్లో 68 శాతం, నిర్మల్లో 66 శాతం, మహబూబ్నగర్లో 65 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వనపర్తి, సిరిసిల్ల, పెద్దపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, మంచిర్యాల, జనగాం తదితర జిల్లాల్లో సాధారణంకన్నా 50 శాతానికిపైగా వర్షపాతం నమోదు కాగా, భూపాలపల్లి, కరీంనగర్, కుమ్రంభీం, మహబూబ్నగర్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల్లో సాధారణం కన్నా 60 శాతానికిపైగా వర్షపాతం నమోదైంది.
ఇక భూగర్భ నీటిమట్టం విషయానికొస్తే, అక్టోబర్లో సరాసరి నీటి మట్టం భూఉపరితలం నుంచి 3.71 మీటర్ల దిగువన ఉన్నట్టు నమోదైంది. మొత్తం 33 జిల్లాలకుగాను 25 జిల్లాల్లో సరాసరి నీటిమట్టం ఐదు మీటర్లకన్నా తక్కువ లోతులోనే ఉండటం విశేషం. అక్టోబర్లో నీటిమట్టం 0.78 మీటర్లు పెరిగినట్టు భూగర్భజలశాఖ తెలిపింది. ఈ ఏడాది మే నెలతో పోల్చితే భూగర్భ నీటిమట్టం 5.30 మీటర్లు పెరిగింది. ఇందులో వనపర్తిలో అతితక్కువగా 2.54 మీటర్లు పెరుగగా, మెదక్లో అత్యధికంగా 8.96 మీటర్ల పెరుగుదల నమోదైంది. ఐదు మీటర్లలోపు భూగర్భ నీటిమట్టం రాష్ట్రంలోని 77 శాతం విస్తీర్ణంలో నమోదైంది. ఐదు నుంచి పది మీటర్లలోపు నీటిమట్టం సగటున 20 శాతం విస్తీర్ణంలో, అలాగే రెండు శాతం విస్తీర్ణంలో 10 నుంచి 15 మీటర్లలోపు నీటిమట్టం నమోదైంది. 15 నుంచి 20 మీటర్లలోతు నీటిమట్టం ఒక్కశాతం విస్తీర్ణంలో నమోదుకావడం విశేషం.