హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు ఏర్పాటు చేసుకొనేవారికి ఉద్దేశించిన టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల ద్వారా గత ఏడేండ్లలో రూ.4,115.26 కోట్లమేర రాయితీలు కల్పించినట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. వీటి ద్వారా 46,636 మందికి లబ్ధి చేకూరింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అర్హులైన దరఖాస్తుదారులకు నిర్ణీత గడువులోగా రాయితీలు, ప్రోత్సాహకాలు మంజూరు చేస్తున్నట్టు తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక-2022 వెల్లడించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూయర్ అడ్వాన్స్మెంట్ (టీ-ఐడియా) పథకం ద్వారా పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టుకొనే జనరల్ క్యాటగిరీ వ్యక్తులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్, విద్యుత్తు, పెట్టుబడి, వడ్డీ రాయితీ, పెట్టుబడి సహాయం తదితరవాటితోపాటు క్వాలిటీ కంట్రోల్, పేటెంట్ రిజిస్ట్రేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. 2014-15లో టీ-ఐడియా ప్రారంభించినప్పటి నుంచి ఈ ఏడాది జనవరి నాటికి 47.3 శాతం దరఖాస్తులకు రూ.2,965.10 కోట్ల రాయితీలు మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కోసం ప్రారంభించిన తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూయర్స్ (టీ-ప్రైడ్ ) పథకం ద్వారా ఆయా వర్గాలకు ప్రోత్సాహకాలు, రాయితీలు, పన్ను ఫీజుల రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. 2016-17 నుంచి 2021-22 (జనవరి 2022 వరకు) వరకు 12,602 మంది ఎస్సీలు, 11,694 మంది ఎస్టీలకు రూ.1,150.16 కోట్ల రాయితీలు కల్పించారు.