న్యూఢిల్లీ : ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటి వరకు 450 మంది తెలంగాణ విద్యార్థులు భారత్కు చేరుకున్నారు. విడుతల వారీగా ఢిల్లీ చేరుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. అక్కడ్నుంచి హైదరాబాద్కు విమానాల్లో విద్యార్థులను తెలంగాణ ప్రభుత్వం తరలిస్తోంది. తెలంగాణ విద్యార్థుల యోగక్షేమాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ వెల్లడించారు.
ఇంకా ఉక్రెయిన్లో 350 మంది వరకు తెలంగాణ విద్యార్థులు ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లో ఉన్న భారత ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులను భారత్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం, హిందన్ ఎయిర్ బేస్ రెండు ప్రాంతాల్లో తెలంగాణ అధికారుల బృందాలు విద్యార్థులును రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పారు. విద్యార్థులకు కావాల్సిన వైద్య, వసతి, ఆహార, రవాణా సదుపాయాలు కల్పిస్తూ వారి స్వస్థలాలకు పంపుతున్నామని గౌరవ్ ఉప్పల్ పేర్కొన్నారు.