హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర స్త్రీనిధి సహకార సంస్థలో వేధింపులు, కఠిన నిబంధనలు, పనిభారం కారణంగా పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. మొత్తం 737 మంది సిబ్బందికిగాను 450 మందికిపైగా ఉద్యోగాలకు రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. స్త్రీనిధి సంస్థ ఎండీ విద్యాసాగర్‌రెడ్డి 12 ఏండ్లుగా కుర్చీ వదలకుండా కూర్చొని.. ఏకపక్ష నిర్ణయాలతో సిబ్బందిపై పనిభారం పెంచుతున్నారని, క్యాడర్, పని విభజన చేయకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
మహిళల పొదుపు సొమ్ముతో స్త్రీనిధి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్, షేర్ముల్ సంస్థల ఆగడాలు తాళలేక రుణాలు తీసుకున్న అనేకమంది మహిళలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలను నివారించడం కోసం మహిళా సమాఖ్యల భాగస్వామ్యంతో అప్పటి కాంగ్రెస్ సర్కారు 2011 సెప్టెంబర్‌లో రూ. 800 కోట్ల మూలధనంతో స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అనే సంస్థను ప్రారంభించింది. ఇందులో మహిళా సమాఖ్య డబ్బులు రూ.700 కోట్లు కాగా, రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉన్నది. ఈ మూలధనాన్ని గ్యారెంటీగా పెట్టి వివిధ బ్యాంకుల నుంచి రూ.3,500 కోట్లు అప్పుగా తీసుకొని ఇప్పటికీ మహిళలకు రుణాలు ఇస్తున్నారు.
సిబ్బందిలో సగానికిపైగా రాజీనామా
స్త్రీనిధి సంస్థలో మొత్తం వివిధ హోదాల్లో 737 మంది ఉద్యోగులు ఉండగా, వీరిలో ఇప్పటివరకు 451 మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు. మరో 20 మంది వరకు తొలగింపునకు గురయ్యారు. ప్రస్తుతం 286 మంది మాత్రమే పనిచేస్తున్నట్టు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. రాజీనామాలు చేసినవారిలో బీసీలు 250 మంది (55%), ఎస్సీలు 97 (22%), ఎస్టీలు 25 మంది (6%), ఓసీలు 79 మంది (18%) ఉన్నారు. స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి టార్గెట్ చేసి కొందరిని తీసివేయగా, మరికొందరు అధికారుల వేధింపులు, పనిభారం భరించలేక రాజీనామా చేసి వెళ్లిపోయారు. సిబ్బంది కొరత ఏర్పడటంతో రుణాల పంపిణీ, రికవరీపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా రుణాల ఎగవేతలు ఆరు శాతానికి పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
నెలలో 40సార్లు గ్రామాలకు..
అసిస్టెంట్ మేనేజర్లు నెలలో కనీసం 40 సార్లు గ్రామాలకు వెళ్లి రుణాల మంజూరు, రివకరీపై పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రతిగ్రామం నుంచి ఆన్లైన్ హాజరు నమోదు చేయాలి. ఒక్కో గ్రామంలో కనీసం రెండు గంటలు ఉండాలి. మహిళా ఉద్యోగులకు కనీస వసతులు ఉండవు. ఈ క్రమంలో చాలామంది ఉద్యోగులకు నెలలో 40 సార్లు ఆన్లైన్ అటెండెన్స్ చేయకపోవడంతో వేతనంలో కోత పడి రూ.15 వేలు కూడా పొందలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఐఏఎస్ అధికారిని ఎండీగా నియమించాలి
తెలంగాణ స్త్రీనిధిలో కొంతకాలంగా అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఈ సంస్థలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రిటైర్డ్ అధికారి ఎండీగా ఉండటం, అనేక హెచ్ఆర్ పాలసీలు అమలుచేయకపోవడంతో ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు 450 మందికిపైగా రాజీనామాలు చేశారు. మరో 50 మంది వరకు టెర్మినేషన్‌కు గురయ్యారు. క్షేత్రస్థాయి సిబ్బందికి ఆన్లైన్ అటెండెన్స్ విధానం అమలుచేయడం, ఇది వేతనంతో ముడిపడి ఉండటం వల్ల ఇక్కట్లు ఎదురవుతున్నాయి. సిబ్బందికి క్షేత్రస్థాయిలో మద్దతు లేకపోవడం, రుణ రికవరీలో ఇబ్బందులకు కారణమవుతున్నది. ఐఏఎస్ స్థాయి అధికారిని ఎండీగా నియమించి ఆన్లైన్ అటెండన్స్ విధానంగా మార్పులు తీసుకొస్తే పరిష్కారం లభిస్తుంది.
-రాము, స్త్రీనిధి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి