Electric Vehicles | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్ వాహనాల(ఈవీ) కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు ఆశాజనకంగా మారాయి. ఈవీ టావీలర్స్కు రూ.15వేల వరకు, కార్లపై రూ.3 లక్షల వరకు రాయితీ లభిస్తుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువ చూపుతున్నారు. రాష్ట్రంలో క్రమంగా ఎలక్ట్రిక్ కార్లు, ఆటోరిక్షాలు, బైక్స్ కొనుగోళ్లు పెరుగుతన్నాయని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. నిరుడు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 25 వరకు 78,862 కొత్త ఈవీలు, అంతకుముందు ఏడాది 52,134 ఈవీల రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. ఏడాదిలో కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు 52.28 శాతం పెరిగాయని పేర్కొంది. ఏడాదిలో మోటార్ సైకిళ్లు, ఆటోలతో పాటు అన్ని రన్ని రకాల ఈవీల రిజిస్టేషన్‌లో భారీగా వృద్ధి నమోదవగా కార్ల సంఖ్యలో కొంత తగ్గుదల ఉందని అధికారులు చెప్పారు. పాత విధానంలో ఫీజుల మినహాయింపు, రాయితీల విషయంలో కార్ల సంఖ్యపై పరిమితి ఉండడంతో కోటా దాటడంతో 2022-23తో పోలిస్తే 2023-24లో విద్యుత్ కార్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయని వివరించారు.
పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల వల్ల నగరాలు, పట్టణాల్లో కాలుష్యం పెరుగుతోంది. దీంతో ప్రజల్లో కాలుష్యరహిత వాహనాలపై అవగాహన పెరిగింది. ప్రభుత్వం నవంబర్ 18న కొత్త పాలసీ తీసుకొచ్చింది. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజును రవాణాశాఖ పూర్తిగా మినహాయింపు ఇస్తున్నది. 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. దూర ప్ర యాణంలో చార్జింగ్ స్టేషన్ల కొరతను పరిష్కరిస్తే ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని వినియోగదారులు చెబుతున్నారు.