హైదరాబాద్, మార్చి20 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్ : రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్‌యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులగణన లెకల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో ఈ రిజర్వేషన్లను వర్తింపజేయాలని కోరారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివిధ బీసీ కులసంఘాల నేతలతో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రంపై నెపం మోపి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 9వ షెడ్యూల్లో చేర్చితే 42% రిజర్వేషన్ చట్టానికి రక్షణ కలుగుతుందనుకోవడం మూర్ఖత్వమేనని వెల్లడించారు. సినిమా నటులకంటే సీఎం రేవంత్‌రెడ్డి పెద్ద యాక్టర్ అని, రిజర్వేషన్ల కోసం ఢిల్లీ పోదామంటూ ఆయన చేస్తున్న యాక్టింగ్‌ను మానుకోవాలని హితవు పలికారు. బీసీలను మోసగించేందుకే 9వ షెడ్యూల్ డ్రామా అని విమర్శించారు.
29వ జీవో తెచ్చి బీసీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన రేవంత్‌రెడ్డి.. రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లలో 42% బీసీ రిజర్వేషన్లను అమలుచేసి తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, లేదంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ నెల 27న బీసీ మేధావులు, కులసంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, ఏప్రిల్ 12న వేలాది మందితో ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. సమావేశంలో బీసీ హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధేశ్వరులు, బీసీ అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.