హనుమకొండ చౌరస్తా, జనవరి 31 : హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ నెల 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధబేరి సభ బీసీ సర్కార్ కోసమేనని కుడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పేర్కొన్నారు. ఇది ఆరంభ సభ మాత్రమేనని, 15 లక్షల మందితో హైదరాబాద్ జింఖానా గ్రౌండ్లో విజయభేరి మోగిస్తామని చెప్పారు. బీసీ వరంగల్ జేఏసీ చైర్మన్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హనుమకొండలో రేపు నిర్వహించే రాజకీయ యుద్ధబేరి సభ.. విజయ భేరి సభగా మారబోతున్నదని తెలిపారు.
రానున్న రోజుల్లో బీసీల ఐక్యతతో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. దశాబ్దాలుగా ‘మాతో ఓట్లు వేయించుకుంటూ.. మీరు గద్దె మీద కూర్చుంటున్నారని, బీసీలమంతా ఏకమయ్యామని, ఇక నుంచి ఓట్లు మావే.. సీట్లూ మావేనని’ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్తోపాటు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో మొదలు పెట్టి, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో సైతం 50శాతం సీట్లు కేటాయించాలని, లేకపోతే బీసీలమంతా ఏకమైతే పార్టీలకు పుట్టగతులుండవని హెచ్చరించారు. 6.2 శాతం ఉన్న ఉన్నతవర్గాలకు 10శాతం రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నించారు. వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. వరంగల్లో ఆరంభమైన సభ జింఖానా గ్రౌండ్లో విజయభేరి సభగా ముగుస్తుందని చెప్పారు.
ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా ఆశీర్వదించాలని సుందర్రాజ్ కోరారు. 32 సంవత్సరాలుగా విద్యావ్యవస్థలో ఉన్న తనకు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసని చెప్పారు. అటు ప్రభుత్వ విద్యావ్యవస్థ, ఇటు ప్రైవేట్ విద్యావ్యవస్థపై అవగాహన ఉన్నవ్యక్తిగా మండలిలో ఉపాధ్యాయుల సమస్యలపై గళమెత్తుతానని తెలిపారు.